కరోనా కారణంగా గత తొమ్మిది నెలలకు పైగా మూతపడ్డ ధియేటర్లు కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఎట్టకేలకు ఈ సంక్రాంతికి తెరుచుకున్నాయి. ఇక తెలుగువారికి పెద్ద పండుగ సంక్రాంతికి... ఈ పండుగను అల్లుళ్ల పండుగ అని కూడా అంటారు. దూర ప్రాంతాల నుండి సొంత ఊర్లకు వచ్చి ఈ పండుగ వారం అంతా చాలా వేడుకగాసందడిగా గడుపుతారు. రిలీజ్ అయ్యే కొత్త సినిమాలన్నింటినీ కుటుంబ సమేతంగా చూసి ఆనందిస్తారు. అలాంటి పండుగ వాతావరణంలో తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలనే కోణంలో సంక్రాంతి అల్లుడిగా రంగంలోకి దిగాడు బెల్లంకొండ శ్రీనివాస్. 'రాక్షసుడు' లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అల్లుడు అదుర్స్ సినిమా చేశాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటించారు. ప్రకాష్ రాజ్, సోనూ సూద్ కీలక పాత్రలు పోషించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ మూవీ కథ మరియు కథనాల విషయానికి వస్తే...




శీను (బెల్లంకొండ శ్రీనివాస్) వసుంధర (అను ఇమ్మాన్యుయేల్)ని ప్రేమిస్తాడు, కానీ అప్పటికే గజ (సోను సూద్) తో ప్రేమలో ఉంటుంది వసుంధర. కట్ చేస్తే వసుందర చెల్లెలైన కౌముది (నభా నటేష్)- శీను ప్రేమలో పడతారు. ఈ కన్ఫ్యూజింగ్ లవ్ ట్రాక్ వల్ల ఇద్దరు హీరోయిన్ల తండ్రి అయిన నిజామాబాద్ జైపాల్ రెడ్డి (ప్రకాష్ రాజ్) ఎలా ఇబ్బంది పడ్డాడు.. తర్వాత జరిగిన పర్యవసనాలేంటి? అనేదే 'అల్లుడు అదుర్స్' కథ. ఈ కథకు ఎలాంటి ముగింపు ఇచ్చారు? హీరో తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అనేది మూవీ చూసి తెలుసుకోండి. కథనంలో ఎక్కడా కామెడీని మిస్ కాకుండా నడిపించారు డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్. సినిమా చూస్తున్నంత సేపు డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ గత సినిమా అయిన 'కందిరీగ' సినిమానే గుర్తుకొస్తూ ఉంటుంది. ఆ సినిమాలో ఎలాగైతే కన్ఫ్యూజింగ్ హౌస్ కామెడీని హైలైట్ చేశారో ఇందులో కూడా అదే రిపీట్ చేశారు. కాన్సెప్ట్‌లో కొత్తదనం లేకున్నా డిఫరెంట్ నెరేషన్‌తో సినిమాపై ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఫస్టాఫ్ అంతా కామెడీ సీన్స్ తోనే రన్ అయింది. శీను తన ప్రేమను గెలుచుకునే ప్రయత్నంలో భాగంగా నిజామాబాద్ జైపాల్ రెడ్డిని తికమక పెట్టిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో ప్రకాష్ రాజ్, బెల్లంకొండ శ్రీనివాస్ పంచే కామెడీ ఆకట్టుకునేలా ఉంది. కౌముదితో ప్రేమాయణం, ఇంతలో చనిపోయిందనుకున్న వసుందర ఎంట్రీ కథలో కీలక మలుపు. అక్కడి నుంచి కథనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. తన ఫస్ట్ లవ్ అయిన వసుందర కోసం, తనను కాదని వేరే వ్యక్తి గజను ప్రేమించిన ఆమె ప్రేమ కోసం శీను పడిన తాపత్రయం బోర్ కొట్టించకుండా సినిమాను ముందుకు తీసుకెళ్లింది.

విలన్‌గా భారీ రేంజ్‌లో ప్రకాష్ రాజ్ పాత్రను పరిచయం చేసినప్పటికీ కథనంలో ఆయన పాత్రను కామెడీతో మిక్స్ చేయడంతో ఆ రోల్ పవర్ తగ్గినట్లుగా అనిపించింది. సోనూ సూద్ నటన మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ తికమక లవ్ స్టోరీలో కమెడియన్స్ శ్రీనివాస్ రెడ్డి, సత్య, చమ్మక్ చంద్ర రోల్స్ కామెడీ పార్ట్‌ని బాగా హైలైట్ చేశాయి. ఇక వెన్నెల కిషోర్, మహేష్ విట్టా, గెటప్ శీను, మిర్చి హేమంత్ వారి వారి పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు. 'సీ' సెంటర్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా హీరోయిన్ నభా నటేష్‌తో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. మరో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌ మెయిన్ హీరోయిన్ కాకపోయినప్పటికీ కథలో కీలక మలుపు తిప్పే పాత్రను చేజిక్కించుకుంది. ఇక దేవీ శ్రీ బాణీలు సినిమాకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా నేపధ్య సంగీతం మామూలుగా ఉన్న సీన్‌ని కూడా బాగా ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రతి సినిమాలాగే చాలా రిచ్‌గా, లావిష్ గా ఉన్నాయి. మొత్తానికి కొంచెం పాత తరహా పద్ధతులనే పాటించినప్పటికీ ఈ ఏడాది సంక్రాంతి 'అల్లుడు అదుర్సే'.

మరింత సమాచారం తెలుసుకోండి: