నటీనటులు : ధనుష్ ,ఐశ్వర్య లక్ష్మీ,జోజు జార్జ్ తదితరులు

సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ క్రిష్ణ

మ్యూజిక్: సంతోష్ నారాయణన్

ఎడిటింగ్: వివేక్

నిర్మాతలు: శశికాంత్,రామచంద్ర

రచన,దర్శకత్వం: కార్తిక్ సుబ్బరాజ్

 

తమిళ స్టార్ హీరో హోదా అనుభవిస్తున్న ధనుష్ మంచి సినిమాలు చేస్తాడనే పేరున్న కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్లో సినిమా వస్తోంది అంటే కచ్చితంగా దాని మీద అంచనాలు భారీగా ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఈ సినిమా మేకర్స్ చాలా రోజులపాటు థియేటర్లో సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేయడం, ఎంతకూ కుదరకపోవడంతో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయాలని భావించడంతో  ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. దానికి తగ్గట్టే ఇందులో గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నాడని ముందునుంచే ప్రచారం చేయడంతో సినిమా మీద అందరూ ఆసక్తి చూపించారు. మరి సినిమా ఆ మేరకు అంచనాలను అందుకుందా ? కార్తీక్ సుబ్బరాజు - ధనుష్ కాంబినేషన్ జనాన్ని ఆకట్టుకుందా ? అనే విషయం తెలుసుకుందాం.



అసలు కథ ఏమిటంటే

తమిళనాడులోని మధురైకి చెందిన సురుళి(ధనుష్) అక్కడ ఒక లోకల్ గ్యాంగ్ లో మంచి పొజిషన్ లో ఉంటాడు. అయితే లోకల్ గా ఉన్న శత్రువులు తాకిడి తట్టుకోలేక ఆయన ఒక నెల రోజుల పాటు అండర్ గ్రౌండ్ కి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్లాలి ? ఏం చేయాలి ? అని ఆలోచిస్తున్న సమయంలో ఆయనకు లండన్ నుంచి ఒక బంపర్ ఆఫర్ వస్తుంది.  లండన్ లో గ్యాంగ్ స్టర్ గా లండన్ మొత్తాన్ని శాసించే పీటర్ ను తమిళనాడు నుంచి వెళ్ళిన గ్యాంగ్ స్టర్ శివ దాసు(జొజు జార్జ్) బలహీన పరచాలని అనేక ఎత్తులు వేస్తూ ఉంటాడు.  ముల్లును ముల్లుతోనే తీయాలి అనే కాన్సెప్ట్ నమ్మిన పీటర్ సురుళిని పిలిపించి శివదాసును చంపడానికి ప్రయత్నాలు చేయిస్తాడు. మరి పీటర్ ప్లాన్ వర్కౌట్ అయిందా ? శివదాస్ ను  సురుళి చెప్పాడా ? లండన్లో సురుళి ఎవరితో ప్రేమలో పడతాడు ? చివరికి ఏమైంది ? అనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

సినిమా ఎలా ఉంది అంటే

ధనుష్ ఒక అద్భుతమైన నటుడు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ అన్నీ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తే సూపర్ స్టార్ హోదా రాదు కదా. అందుకే కొన్ని అలాంటి సూపర్ స్టార్ క్రేజ్ తెచ్చి పెట్టే సినిమాలు చేయాలి. అలాంటి సినిమానే ఈ జగమే తంత్రం. తమిళులు అందరూ ఓన్ చేసుకుని వీడు మనోడే అనుకోవాలి అంటే తమిళుల కోసం పోరాడినట్లు చూపించాలి. అయితే రాష్ట్రంలోనే ఉంచి పోరాడితే అది రాజకీయాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల తమిళులు ఇబ్బంది పడుతున్న కథాంశాలతో సినిమాలు చేశారు. 


ఇప్పటికే శ్రీలంక, మలేషియా ముంబై లాంటి ప్రాంతాల్లో ఇలాంటి కథలతో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాని లండన్ బ్యాక్ డ్రాప్ లో చేశారు. ఒక ఇంగ్లీషు వ్యక్తి కోసం పనిచేయడానికి వెళ్లిన తమిళ వ్యక్తి తాను మరో తమిళ వ్యక్తి మీద పోరాటం చేస్తున్నాననే విషయం తెలుసుకుని ఎలా మారాడు అన్నదే కధ. అయితే ఎవరినైతే చంపడానికి వెళ్ళాడో అతని రహస్యాలన్నీ ఈజీగా పట్టేసిన ధనుష్ అతని ఫ్లాష్బ్యాక్ తెలియకపోవడమే కాస్త ఆలోచింపజేస్తుంది. 


సినిమాలో ఎంతసేపు ధనుష్ ను రజనీకాంత్ స్టైల్ లో చూపించడానికి తాపత్రయపడిన దర్శకుడు సినిమా కథ, కథనం మీద దృష్టి పెట్టలేదు అనిపిస్తోంది. కథా, కథనం బలం లేకపోవడంతో సినిమా తేలిపోయినట్లు అనిపిస్తుంది. అదీగాక ఒక మాస్ మసాలా ఎంటర్టైనర్ గా మొదలైన ఈ సినిమా ఒక్కసారిగా సీరియస్ మూవీగా మారిపోతుంది. అలా మారడానికి సరైన కారణాలు చూపించే లేకపోవడంతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యిందనే చెప్పాలి.



నటీనటుల పెర్ఫార్మెన్స్

ఎప్పటిలాగే ధనుష్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కథనం కాస్త బోర్ కొట్టిస్తుంది అని భావించిన వెంటనే ఆయన తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. అయితే ధనుష్ నటన బాగానే ఉన్నా ఇదివరకు ధనుష్ మాఫియా నేపథ్యంలో చేసిన అన్ని సినిమాలతో పోలిస్తే మాత్రం ఇందులో నటన తేలిపోయినట్లు అనిపిస్తుంది. ఇక జోసెఫ్ అనే మలయాళ సినిమాలో ఫేమస్ అయి మొన్న నాయాట్టు సినిమాలో కూడా జోజి జార్జి కూడా తమిళ గ్యాంగ్ స్టార్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్, అలాగే మిగతా పాత్రధారులు తమ పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు.


టెక్నికల్ వర్క్ విషయానికి వస్తే

ఇక్కడ ముందుగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ సంగీతం గురించి.. మరీ ముఖ్యంగా ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ అయింది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునే విధంగా సాగింది. అయితే ఎడిటర్ ఇంకాస్త మెరుగ్గా సీన్లను కత్తిరించి ఉంటే సినిమా కాస్త ఆసక్తికరంగా సాగినట్లు అనిపించేది. ఇక పెద్ద సంస్థల ప్రొడక్షన్ కావడంతో ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా ఆకట్టుకున్నాయి. సౌండ్ విషయంలోనే ప్రేక్షకులు కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. సంగీతదర్శకుడు తప్పేమీ లేకపోయినా బహుశా టెక్నికల్ ఇష్యూస్ వల్ల సినిమా సౌండ్ క్లారిటీ సరిగ్గా లేకపోవడంతో ఫీల్ పోయింది. ఇక బహుశా ఇది థియేటర్ల కోసం సిద్ధం చేసిన ప్రింట్ అయ్యుండొచ్చు అందుకే నేరుగా డిజిటల్ రిలీజ్ చేయడంతో ఆడియో విషయంలో కాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.

ఇండియా హెరాల్డ్ తీర్పు : జగమే తంత్రం 'ఓన్లీ ఫర్ ఫ్యాన్స్', సగటు ప్రేక్షకులు చూస్తే 'అంతం' ఫీలింగ్


ఇండియా హెరాల్డ్ రేటింగ్ : 2 / 5

మరింత సమాచారం తెలుసుకోండి: