చిత్రం : జులాయి బ్యానర్ : హారిక అండ్ హసిని క్రియేషన్స్ నటీనటులు : అల్లు అర్జున్, ఇలియానా, రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, సోనూసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మనందం తదితరులు  సంగీతం : దేవీశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, చోటా కె నాయుడు  నిర్మాత : ఎస్.రాధాకృష్ణ, దర్శకత్వం : త్రివిక్రమ్ రేటింగ్ : 2/5  రచయితగా సినిమా పరిశ్రమకు పరిచయమైన త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకంటూ ఓ ప్రత్యేక మైన గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుడిగా మారిన తరువాత అంతకంటే ఇంకా ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నాడు. నువ్వే.. నువ్వే, అతడు వంటి సినిమాలు త్రివిక్రమ్ దర్శకత్వ ప్రతిభను చాటి చెప్పాయి. అయితే ఖలేజా సినిమా ఫలితం తీవ్రంగా నిరాశ పరిచింది. దీంతో ఎంతో గ్యాప్ తీసుకుని, ఎంత కష్టపడి జూలాయి సినిమా తెరకెక్కించాడు.  ఇటు వైపున హీరో అల్లు అర్జున్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయవంతం కావడం లేదు. అర్జున్ ఎంతో కష్టపడి డాన్సులు, ఫైట్లు చేస్తున్నా అసలు ఫలితం దక్కడం లేదు. ఈ సారి త్రివిక్రమ్ ను నమ్ముకుని జూలాయి గా మారాడు.  ఈ సినిమాను ఎంత గ్రాండ్ గా తెరకెక్కించారో, అంతే గ్రాండ్ గా రిలీజ్ చేశారు. తెలుగులో ఏ సినిమాకు లేని విధంగా ఈ జూలాయికి ప్రచార గీతం కూడా తయారు చేశారు. మరి ఇంత గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జులాయి సినిమా తనపై ఉన్న అంచనాలను అందుకుంటుందా..? చిత్రకథ : లెక్కల మాస్టారు (తనికెళ్ల భరణి) కొడుకు రవి (అల్లు అర్జున్)కు మధ్య తరగతి జీవితం అంటే ఇష్టం ఉండదు. త్వరగా ఎక్కువ డబ్బును సంపాదించి ఉన్నతంగా బ్రతకాలని కోరుకుంటాడు. మరి ఈ లక్ష్యాన్ని రవి చేరుకున్నాడా..?, అసలు అతను ఈ లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు ఏం తెలుసుకున్నాడు అనేది ఈ చిత్రకథ. నటీనటుల ప్రతిభ : అల్లు అర్జున్ ఎప్పటిలానే చలాకీగా, ఉషారుగా నటించాడు. డాన్సుల్లో అదరగొట్టాడు. ముఖ్యంగా జులాయి, ఓ మధు ఓ మధు, మీ ఇంటికి ఉందో గేటు.. పాటల్లో డాన్సులు బాగున్నాయి. ఫైట్స్ లో దుమ్ము రేపాడు. ఈ సినిమాలో అతనిలో లోపాలను ఎంచలేం. హీరోయిన్ ఇలియానా తన పరిధిలో తాను చేసింది. అయితే ఆమె ముఖంలో మునుపటి కళాకాంతులు లేవు. సినిమాలోనే హీరో ఒక చోట చెప్పినట్లు ‘కరువు వచ్చిన దేశానికి బ్రాండ్ అంబాసిడర్’ లా ఉంది. విలన్ గా చేసిన సోనూసూద్ మరోసారి ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించాడు. తనవంతు బాగానే చేశాడు. రాజేంద్రప్రసాద్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. బ్రహ్మనందం, ధర్మవరపు,హేమ తదితరులు తమ పాత్రల్లో నటించారు.  సాంకేతిక వర్గం : ఫోటోగ్రఫీ బాగుంది. సంగీతం సూపర్. మాటలు, పాటలు బాగున్నాయి. నిర్మాణం రిచ్ గా సాగింది. ఇక దర్శకుడి విషయానికి వస్తే సాధారణమైన కథను తన తెలివితేటలతో అద్భుతంగా చెప్పాలను కున్నాడు. అయితే ఈ సినిమాలో లాజిక్ లు ఉండవు. హీరో తెలివైన వాడు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలడు. (ఇందుకు ఉదాహరణ : సినిమా అంతా తెలివైన వాడిగాను, చాలా సమర్థుడు గా చూపించిన విలన్ ను సినిమా చివరికి వచ్చే సరికి ఒక్కసారిగా జోకర్ లా మార్చి వేశారు) అదేలా జరిగింది.. ఇదేలా సాధ్యం.. వంటి ప్రశ్నలకు ఈ సినిమాలో సమాధానాలు ఉండవు. త్రివిక్రమ్ తన స్థాయి తగ్గించుకుని తీసిని సినిమా ఇది. ఈ చిత్రాన్ని తెరక్కెకించడానికి త్రివిక్రమ్ లాంటి దర్శకుడు ఇంత గ్యాప్ తీసుకోవడం అనవసరం. ఈ సినిమాలో అసలు కథంతా సెకండ్ ఆఫ్ లోనే జరుగుతుంది. సెకండ్ ఆఫ్ లోనే కథ తో పాటు కొన్ని కొన్ని ఆసక్తి కరమైన సన్నివేశాలు ఉంటాయి. హైలెట్స్ : అల్లు అర్జున్ నటన, డాన్సులు, త్రివిక్రమ్ మాటలు,  పెళ్లి చూపుల సన్నివేశం,  ఆసుపత్రిలో తండ్రి కొడుకుల మధ్య సాగే సన్నివేశం.  డ్రాబాక్స్ : నెమ్మదిగా సాగే ఫస్టాఫ్, లాజిక్ లేని సన్నివేశాలు.  అంతగా ఆకట్టుకోని స్కీన్ ప్లే మాటలు, పాటలు, డాన్సులు ఒక సినిమాకు అదనపు సొగసులు గానే ఉంటాయి. సినిమాకు అసలు బలం కథ, స్ర్కీన్ ప్లే మాత్రమే. ముందు చెప్పిన వాటినే నమ్ముకుంటే ఫలితం అంత అంత మాత్రంగా ఉంటుంది. చివరిగా .. అల్లు అర్జున్ డాన్సులు, త్రివిక్రమ్ మాటలు కోసం ఈ సినిమాను చూడవచ్చు.    

మరింత సమాచారం తెలుసుకోండి: