ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, క్లాస్ వర్గాలలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇతను దర్శకత్వం వహించిన  తాజా సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడటానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించడం ఓ ప్రధాన కారణమైతే, అమల అక్కినేని దాదాపు 20 సంవత్సరాల తరువాత ఈ సినిమాలో నటించడం, అందాల తారలు శ్రియ, అంజులా ఝావేరి కూడా ఈ చిత్రంలో నటించడం కూడా ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడేటట్లు చేశాయి. మరి ఈ అంచనాలను శేఖర్ కమ్ముల అందుకున్నాడా.. లేదా.. అనే విషయం పరిశీలిద్దాం..!  చిత్రకథ : విశాఖపట్నంలో ఉండే అమల ( అమల అక్కినేని) తనకు ట్రాన్స్ ఫర్ అయింది, వేరే ఊరు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి తాతయ్య, అమ్మమ్మ ల దగ్గర ఉండమని తన ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తుంది. దీంతో తన ఇద్దరి చెల్లెల్ని తీసుకుని శ్రీనివాస్ (అభిజిత్) హైదరాబాద్ లోని సన్ షైన్ వ్యాలీ కాలనీ కి వస్తాడు. ఈ కాలనీలో అతనికి నాగరాజు ( సుధాకర్), అభి (కౌషిక్) లు పరిచయం అవుతారు. మావయ్య కూతురు పద్దు (షాగన్)తో ప్రేమలో పడతాడు. అలాగే అనుకోకుండా తమ కాలనీ లోని గోల్డ్ ఫేజ్ బ్లాక్ లోని బ్యాచ్ తో గొడవ పడతాడు. తన మిత్రులతో శ్రీనివాస్ ఫ్రెండ్ షిఫ్ ఎలా సాగింది, తన ప్రేమను ఎలా నిలుపుకున్నాడు అనే కథాంశంతో ఈ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సాగుతుంది. అలాగే, నాగరాజు, అభిల ప్రేమ కథ, గోల్డ్ ఫేజ్ కాలనీ అబ్బాయిలతో వీరికి ఉండే శత్రుత్వం అంశాలుగా ఈ సినిమా సాగుతుంది. అసలు, అమల ఏ కారణంగా తన పిల్లల్ని హైదరాబాద్ పంపించిందో తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాలి. నటీనటులు ప్రతిభ : కొత్తవారైనా అభిజిత్, సుధాకర్, కౌషిక్ లు బాగా నటించారు. అలాగే హీరోయిన్లుగా నటించిన షాగన్, జరాషా లు అకట్టుకుంటారు. దాదాపు 20 సంవత్సరాల తరువాత వెండితెర మీద కనిపించిన అక్కినేని అమల నటన సాధారణంగా సాగుతుంది. ఈ సినిమాలో ఆమెపై సన్నివేశాలు తక్కువగా ఉంటాయి. శేఖర్ కమ్ముల మీద నమ్మకంతోనే అమల ఈ సినిమాలో నటించింది అనిపిస్తుంది. 20 సంవత్సరాల తరువాత మళ్లీ ముఖానికి రంగువేసుకోవాల్సిన గొప్ప పాత్ర అయితే కాదు. అంజులా ఝావేరి ఒకే. ఇక సినిమాలో మిస్ ఇండియా టైటిల్ కోసం పోటీ పడే అమ్మాయిగా శ్రియ నటించింది. అయితే తన కంటే బాగా చిన్నగా కనిపించే అబ్బాయితో లవ్ సీన్స్ లో శ్రియ నటించడం చూసేవారికి ఇబ్బందిగా అనిపించింది. సురేఖవాణి, తదితరలు తమ తమ పాత్రల పరిధిలో నటించారు.   సాంకేతిక వర్గం : ఫోటోగ్రఫీ ఓకే. సంగీతం ఫర్వాలేదు. మాటలు సినిమాకు అనుగుణంగా సాగుతాయి. ‘అమ్మ గురించి ఇంగ్లీష్ లో చెప్పలేం’, ‘రవితేజ వంటి వాడని 50 రూపాయిలు ఇచ్చి థియేటర్ లో చూడగలం, పెళ్లి అయితే చేసుకోలేం’ వంటి మాటలు బాగున్నాయి. నిర్మాత సినిమాకు అనుగుణంగానే ఖర్చు పెట్టాడు. ఇక, దర్శకుడు విషయానికి వస్తే ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్ వంటి చిత్రాలతో తన గొప్పతనం చాటుకున్న శేఖర్ కమ్ముల అదే స్థాయిని ఈ సినిమాలో కనబర్చలేక పోయాడు. సినిమా మొదట్లో క్రికెట్ మ్యాచ్ లో హీరో తన జట్టును గెలిపించడం, అలాగే సినిమా చివర్లో చిన్న అమ్మాయి తన అమ్మ గురించి చెప్పడం వంటి సన్నివేశాలను హృద్యంగా చిత్రీకరించిన శేఖర్ సినిమా మొత్తాన్ని అదే రేంజ్ లో చూపలేకపోయాడు. హ్యపీడేస్ ఛాయలతో ఈ సినిమా సాగుతుంది. ఈ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో శేఖర్ కమ్ముల ప్రేక్షకులను నిరాశ పరచకపోయినా, అద్భుతాలు మాత్రం చేయలేదు. హైలెట్స్, డ్రాబ్యాక్స్ గురించి పెద్దగా చర్చించుకోవలసిన అవసరం లేదు. చివరిగా : హ్యపీడేస్ ప్రభావం నుంచి శేఖర్ కమ్ముల త్వరగా బయట పడాలి.   లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ టీం: బ్యానర్ : ఎమిగోస్ క్రియేషన్స్ నటీనటులు : అభీజిత్ దుబ్బాల, సుధాకర్ కొమకులు, కౌషిక, జరాషా, సౌగం, రష్మీ శాస్ర్త్తి, అమల అక్కినేని, అంజలా ఝావేరి, శ్రియ, సురేఖావాణి, తదితరలు ఫోటోగ్రఫీ : విజయ్ సి. కుమార్ మ్యూజిక్ : మిక్కీ జె. మేయర్ దర్శకత్వం, నిర్మాత : శేఖర్ కమ్ముల    
Prasad can be reached at: Yedida.Viswaprasad@apherald.com Editor can be reached at: editor@apherald.com
 

Life Is Beautiful Full Review in English || Life Is Beautiful Tweet Review

More Articles on LIB || LIB Photos & Wallpapers || LIB Videos

మరింత సమాచారం తెలుసుకోండి: