ఏడాది వయస్సున ఓ బుడ్డోడిదే అదృష్టమంటే. ఎందుకంటే ఏడాది వయస్సు నిండగానే ఏకంగా మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ లాటరీని గెలుచుకున్నాడు మరి. మిలియన్ డాలర్లంటే మన కరెన్సిలో సుమారుగా రూ. 7 కోట్లు. ఇంతకీ విషయం ఏమిటంటే  భారత్ కు చెందిన రమీస్ రెహ్మాన్ అనే వ్యక్తి దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. తన ఆఫీసుకు దగ్గరలోనే లాటరీలమ్మే ఏజెంటున్నాడట.

 

చాలా కాలంగా ఏజెంటు లాటరీలు అమ్ముతున్నా రహ్మన్ ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. అయితే కొడుకు మహమ్మద్ సాలాకు ఏడాది నిండింది. దాంతో  ఆఫీసు నుండి బయలుదేరిన రహ్మన్ ఓ లాటరీ టికెట్ కొని కొడుక్కి బహుమానంగా ఇద్దామని అనుకున్నాడట. దాంతో ఓ లాటరీ టిక్కెట్ కొని ఇంటికొచ్చి కొడుకు చేతిలో పెట్టాడు.  తర్వాత దాన్ని దాచిన తర్వాత  ఆ విషయాన్ని రహ్మన్ అక్కడితోనే మరచిపోయాడు.

 

కొద్ది రోజుల తర్వాత లాటరీ ఏజెంట్ నుండి రహ్మన్ కు ఫోన్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే కొడుకు పేరుతో కొన్న లాటరీకి మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ వచ్చిందని. ఇంకేముంది ఆ ఉద్యోగి కుటుంబం పిచ్చ హ్యాపీ అయిపోయింది. ఏడాది వయస్సున కొడుకు పేరుతో లాటరీ కొనటమేంటి ? ఆ లాటరీ ప్రైజ్ మనీ తన కొడుకు పేరుతో కొన్న టిక్కెట్టుకే రావటమేంటి ? రహ్మన్ కుటుంబసభ్యులు అస్సలు నమ్మక లేకపోతున్నారు.

 

తన కొడుకు పేరుతో కొన్న లాటరీకి ప్రైజ్ మనీ రావటం తనకు చాలా సంతోషంగా ఉందంటూ తండ్రి చెబుతున్నాడు. ఆర్ధికంగా తన కుటుంబానికి ఇక ఎటువంటి ఢోకా లేదనే ధీమా రహ్మన్ లో కనబడుతోంది. ప్రైజ్ మనీ మొత్తం తన కొడుకు భవిష్యత్తుకే ఉపయోగిస్తానని చెప్పటంతోనే తండ్రి ఎంత హ్యాపీగా ఉన్నాడో అర్ధమైపోతోంది. దుబాయ్ లో  ఉంటున్న భారతీయులకు గతంలో కూడా ఇదే విధంగా లాటరీలు వచ్చిన సందర్భాలున్నాయి. మొత్తం మీద ఉద్యోగానికో లేకపోతే ఉపాధి పేరుతో వెళ్ళిన భారతీయులకు పెద్దమొత్తంలో లాటరీలు తగలటం సంతోషమే కదా ?

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: