కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు మళ్లీ వైరస్ బారిన పడిన కేసులు ఎన్నో ఉన్నాయి. దీనికి ముఖ్యకారణం జాగ్రత్తలు పాటించకపోవడమేనని డాక్టర్లు చెబుతున్నారు. కోవిడ్ వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తులు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని.. లేకపోతే మళ్లీ వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే తాజాగా లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ డెంటల్ సర్జరీ అధిపతి డాక్టర్ ప్రవేష్ మాట్లాడుతూ వ్యాధి నుంచి కోలుకున్న వారు తప్పకుండా టూత్ బ్రష్,  టంగ్‌ క్లీనర్ మార్చాలని.. అలా చేయని యెడల మళ్లీ ఇన్ఫెక్షన్ సంక్రమించే ప్రమాదం ఉందని అన్నారు. పళ్ళు తోముకునే బ్రష్, టంగ్ క్లీనర్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఆయన అన్నారు.


అయితే డాక్టర్ ప్రవేష్ చేసిన వ్యాఖ్యలు సమర్థిస్తూ టూత్ బ్రష్, టంగ్‌ క్లీనర్ తప్పనిసరిగా మార్చాలని ఆకాష్ హెల్త్‌కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ భూమికా మదన్‌ చెప్పుకొచ్చారు. ఫ్లూ, దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి తాను టూత్ బ్రష్, టంగ్‌ క్లీనర్ తప్పనిసరిగా మార్చాలని సూచిస్తుంటానని.. కరోనా రోగులకు కూడా ఇదే సలహా ఇస్తున్నానని ఆమె అన్నారు.



శరీరంలో మొదటిసారిగా కరోనా లక్షణాలు కనిపించిన 20 రోజుల తర్వాత టూత్ బ్రష్, టంగ్‌ క్లీనర్ పారేయాలని డాక్టర్ భూమిక మదన్‌ చెప్పారు. టూత్ బ్రష్ మీద కాలక్రమేణా బ్యాక్టీరియా / వైరస్ తిష్ట వేస్తుందని.. దీనివల్ల ఎగువ శ్వాసకోశ అంటువ్యాధులు ప్రబలుతాయని.. అందుకే వాటిని పారేయాలని ఆమె అన్నారు.



మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్ వ్యాధిగ్రస్తుల నుంచి ఇతరులకు సంక్రమిస్తుంది. వైరస్ నేరుగా సంక్రమించవచ్చు లేదా కొంతసేపు గాలిలో ఉండి నోటి ద్వారా లేదా ముక్కు ద్వారా ఇతరుల శరీరంలోకి ప్రవేశించవచ్చు. వస్తువుల ఉపరితలంపై వైరస్ కొంతకాలం పాటు బతికే ఉంటుందని వైద్యులు కరోనా విజృంభణ నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. వ్యాధిగ్రస్తులు పళ్లు తోముకున్న బ్రష్ ల ఉపరితలం పై కూడా వైరస్ అంటుకుపోయి సమీపంలో ఉన్నవారికి ప్రబలుతుంది. వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత ఇదే బ్రష్ తో పళ్లు తోముకున్న వారికి.. అలాగే ఆ బ్రష్ కి దగ్గరగా వెళ్ళిన వారికి కరోనా వైరస్ సోకుతుంది. 



టూత్ బ్రష్, నాలుక క్లీనర్ మొదలైనవి మూసివేసిన టాయిలెట్స్ లో ఉంచితే వాటిపై వైరస్ ఎక్కువకాలం నివసిస్తుంది. వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు ఆధారాలతో సహా వెల్లడించారు కాబట్టి వ్యాధిగ్రస్తులు ఉపయోగించిన టూత్ బ్రష్, నాలుక క్లీనర్ టాయిలెట్స్ లో ఉంచడం ద్వారా గాలిలో వైరస్ ఉండిపోయి వారి కుటుంబ సభ్యులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత పాత బ్రష్ లను పారేసి, నోరు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: