కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆక్సిజన్, ఇతరత్రా వైద్య పరికరాలు తయారుచేసే చైనీస్ కంపెనీలకు భారతదేశం నుంచి విపరీతంగా ఆర్డర్స్ వస్తున్నాయి. భారతీయ ప్రైవేటు సంస్థలు ఏప్రిల్, మే నెలలలో అత్యధికంగా ఆర్డర్లు చేస్తున్నాయి. భారత ప్రైవేట్ కంపెనీలు ఏప్రిల్ నెల నుంచి ఇప్పటివరకు 40 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఆర్డర్ చేయగా.. అధికారిక చైనా కస్టమ్స్ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 21,000 పంపిణీ చేయబడ్డాయి. వాటితో పాటు 5,000 వెంటిలేటర్లు, 21 మిలియన్ ఫేస్ మాస్క్‌లు, 3,800 టన్నుల మందులు ఇండియాకి సరఫరా చేయబడ్డాయి.



చైనాలో కాన్సంట్రేటర్ల తయారీదారుల ఆర్డర్‌లు పెరుగుతుండగా వాటి షేర్లు కూడా పెరుగుతున్నాయి. ఏప్రిల్‌లో యుయు మెడికల్ కంపెనీ యొక్క నికర లాభం 134% పెరిగి 278 మిలియన్ డాలర్లకు చేరుకుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కంపెనీ కి భారతదేశం నుండి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల కోసం 18,000 ఆర్డర్‌లు వచ్చాయి. ఇతర ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల తయారీ సంస్థలకు కూడా బాగా లాభాలు చేకూరుతున్నాయని చైనీస్ బిజినెస్ మీడియా వార్త కథనాలు ప్రచురిస్తుంది.



చైనా నుండి వస్తున్న వైద్య సామాగ్రిని చాలావరకు ప్రైవేటు భారతీయ కంపెనీలే వాణిజ్య ప్రాతిపదికన దిగుమతి చేసుకుంటున్నాయి. మరోవైపు ప్రైవేటు రంగంలోని కొన్ని చైనా కంపెనీలు వివిధ ఛానెళ్ల ద్వారా విరాళాలను అందచేస్తున్నాయి. కాగా, భారతదేశం ఇప్పటివరకు చైనా ప్రభుత్వం నుండి సహాయం కోసం అధికారిక ఆఫర్లను అంగీకరించలేదు. ఏప్రిల్ 30న చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్.. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖలో, ఫోన్ కాల్‌లో సాయం చేస్తామని చెప్పారు కానీ భారత ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఇప్పటివరకు రాలేదట.


ఐతే విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చైనా అధికారులతో మాట్లాడుతూ సరఫరా మార్గాలు తెరిచి ఉంచేలా చూడాలని భారత్ అభ్యర్థించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇండియన్ కంపెనీలు చాలా వస్తువులను చైనా నుండి ఆర్డర్ చేస్తున్నాయి.. అందువల్ల మేము లాజిస్టిక్స్ లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము.. కాబట్టి దయచేసి దీనిని పరిశీలించండి అని ఎస్.జైశంకర్ చైనా అధికారులతో చెప్పినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: