ఆపదలో ఉన్న ప్రజలను కాపాడేందుకు నిద్రమనేసి మరీ తన వంతు సహాయం చేస్తున్న సోనూ సూద్ భారత దేశంలో మాత్రమే కాదు ప్రపంచం నలుమూలలా మంచి పేరు సంపాదిస్తున్నారు. తాజాగా సోనూ సూద్, అతని బృందం కలిసి 3 గంటల వ్యవధిలోనే 11 మంది ప్రాణాలను కాపాడారు. మృత్యువుతో కొట్టుమిట్టాడుతున్న ఎందరో కరోనా రోగులకు ఆక్సిజన్ బెడ్స్ సమకూరుస్తూ వారి పాలిట దైవంగా నిలుస్తున్నారు. అయితే ఎన్నారైలు కూడా సహాయం కోసం సోనూ సూద్ ను ఆశ్రయిస్తున్నారు. అంతర్జాతీయ మీడియా భారత దేశంలో కరోనా సృష్టిస్తున్న బీభత్సాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రసారం చేస్తోంది.


ఢిల్లీ, మహారాష్ట్ర, ఇంకా తదితర ప్రదేశాల్లోని స్మశాన వాటికలలో నెలకొన్న హృదయవిదారకమైన పరిస్థితులు గురించి అంతర్జాతీయ న్యూస్ మీడియా తరచూ ఎన్నో వార్తా కథనాలు ప్రచురిస్తోంది. దీంతో విదేశాల్లో నివసించే భారతీయులు భయాందోళనకు గురవుతున్నారు. తమ తల్లిదండ్రులకు, బంధువులకు ఫోన్ చేసి అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని కోరుతున్నారు. వారిలో చాలామంది సోనూ కి ఫోన్ చేసి తమ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా బారిన పడిన తమ తల్లిదండ్రుల ప్రాణాలు కాపాడాలని ఆయనని వేడుకుంటున్నారు.


ఈ విషయం గురించి పెదవి విప్పిన సోనూ తనకు వారానికి 100 నుంచి 150 వరకు విదేశాల నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. భారత కాలమానానికి, విదేశాల కాలమానానికి మధ్య వ్యత్యాసం ఉంది కాబట్టి సోనూ కి అర్ధరాత్రి సమయంలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దీనివల్ల ఆయన కొన్ని ఫోన్స్ లిఫ్ట్ చేయలేని పరిస్థితి. కానీ తాను ఒక్క నిమిషం నిద్ర లేచి ఫోన్ మాట్లాడినా ఒకరి ప్రాణం కాపాడినట్లు అవుతుందని సోనూ చాలా తక్కువ సమయం నిద్రపోతున్నారట. మొదట విదేశాల నుంచి తనకు తక్కువగా ఫోన్ కాల్స్ వచ్చాయని కానీ ఇప్పుడు వందల సంఖ్యలో వస్తున్నాయని సోనూ ఒక ప్రముఖ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.



"మనీలా, సింగపూర్, యుఎస్, కెనడా వంటి విదేశాల నుంచి తెల్లవారుజాము 2 - 4 సమయంలో నాకు ఫోన్స్ వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు అందరి బాధలు వినేందుకు నేను మెలకువతోనే ఉంటున్నాను. నా నిద్ర కంటే ఒక ప్రాణం ఖచ్చితంగా విలువైనది. ” అని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: