కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది మాటల్లో వర్ణించలేనటువంటి క్షోభకు గురవుతున్నారు. తమ కుటుంబ సభ్యులు కళ్ళముందే ప్రాణాలు విడుస్తుంటే కాపాడలేని నిస్సహాయ స్థితిలో తల్లడిల్లుతున్నారు. కరోనాతో చనిపోయిన వ్యక్తుల పార్థివదేహలు సరైన అంతిమ సంస్కారాలకు కూడా నోచుకోవడం లేదు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే చాలా మంది ప్రజలకు తమ కుటుంబ సభ్యుల పార్థివదేహలను కడసారిగా చూసుకునే భాగ్యం కూడా దక్కడం లేదు.


ఎన్నారైలు తమ రక్త సంబంధీకులు చనిపోతే అక్కడినుంచి స్వదేశానికి రాలేని పరిస్థితి. ఇండియాలోని తమ కుటుంబ సభ్యులు కరోనా బారిన పడితే విదేశాల్లోని ఎన్నారైలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. స్వదేశానికి రాలేని పరిస్థితిలో చిక్కుకుపోయిన ఎన్నారైలు తమ కుటుంబ సభ్యులకు ఏ క్షణం ఏమవుతుందోనని భయంతో వణికిపోతున్నారు. దురదృష్టవశాత్తు కుటుంబ సభ్యులు చనిపోతే.. అంతిమ సంస్కారాలకు హాజరయ్యే పరిస్థితి కూడా లేకపోయింది. ఇప్పటికే చాలా మంది ఎన్నారైలు తమ కన్న వారిని, తోడబుట్టిన వారిని కోల్పోయారు కానీ కడసారి చూపులకు కూడా నోచుకోలేకపోయారు.



అమరావతికి చెందిన ఒక మాజీ మహిళా సర్పంచికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు కెనడాలో ఉద్యోగం చేస్తుండగా చిన్న కుమారుడు అమెరికాలో నివసిస్తున్నారు. అయితే ఆమె కరోనా టీకా తీసుకున్న వారం రోజుల తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమె టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమె కుమారులు ఓ స్నేహితుడి సహాయంతో తమ తల్లిని ఆస్పత్రిలో చేర్పించి ఫోన్ల ద్వారానే యోగక్షేమాలు తెలుసుకున్నారు. కానీ వారం రోజుల వ్యవధిలోనే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై మరణించారు. ఈ వార్త వినగానే కొడుకులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. తన తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించలేని దుస్థితి వచ్చిందని కన్నీరుమున్నీరయ్యారు. కన్నవారికి కనీసం తలకొరివి పెట్టలేని పరిస్థితి వచ్చిందని గుండెలు పగిలేలా రోదించారు. అయితే విదేశాల్లో ఉన్న ఇద్దరు కుమారులు స్నేహితుడు మొబైల్ ఫోన్ ద్వారా తమ తల్లి అంతిమ సంస్కారాలు వీక్షిస్తూ కన్నీరు కార్చారు.



డెల్టా లోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం తన తండ్రి చనిపోగా ఇటీవల తన తల్లి కరోనాతో చనిపోయారు. ఆస్ట్రేలియా దేశం భారత్ పై ప్రయాణ ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో అతను తన తల్లిని కడసారి కూడా చూడలేకపోయారు. తన ఫ్రెండ్స్ సహాయంతో వీడియో కాల్ ద్వారా తన తల్లి అంతిమ సంస్కారాలు చూసి వెక్కి వెక్కి ఏడ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఎన్నారైలు కన్నవారిని యోగక్షేమాలు చూసుకోలేక అంతిమ సంస్కారాలు నిర్వహించలేక తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: