సరిగ్గా 30 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలో కరువు రావటంతో రైతులు, నిరుద్యోగులు ఉపాధి కొరకు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. అయితే ఎడారి దేశాలకు వెళ్ళిన 89 మంది తెలంగాణ వాసులు గల్లంతయ్యారు. పదేళ్ళక్రితం కుటుంబీకులతో ఫోన్స్ ద్వారా మాట్లాడిన వీరంతా ఆ తర్వాత కాంటాక్ట్ లో లేకుండా పోయారు. వారి ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఎక్కువగా కువైట్, దుబాయ్, సౌదీ ఆరేబియా, బెహరాన్ వంటి ఎడారి దేశాలకు వలస వెళ్తున్నారు. గణాంకాల ప్రకారం, ఆరు లక్షల మంది తెలంగాణ వాసులు గల్ఫ్ దేశాలకు వెళ్లారని తెలుస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఆ సమయంలోనే ఉద్యోగాలు దొరికినా వర్క్ అగ్రిమెంట్ ప్రకారం పని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అగ్రిమెంట్ లోని నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుపాలు కావాల్సిందే. ఇలాంటి కారణం వల్లే చాలా మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లోని జైళ్లల్లో మగ్గిపోతున్నారు. ఈ దేశాలు న్యాయస్థానాలు కార్మికులకి 10 నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించడం గమనార్హం.

ఉపాధి కోసం వలస వెళ్లిన కార్మికులు విమానం దిగిన వెంటనే వారితో అక్కడి పర్యవేక్షకులు పరిచయం పెంచుకుంటారు. తర్వాత తాము మంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఎడారి ప్రాంతాలకి తీసుకువెళ్లి పని చేస్తుంటారు. అంతేకాకుండా, అనేక చిత్రహింసలు పెడుతుంటారు. ఒకవేళ చిత్ర హింసలు భరించలేక పారిపోయినా.. అక్కడి పోలీసులకు చిక్కి పాస్పోర్ట్, వీసా లేక కటకటాల పాలవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్కార్మికుల సంక్షేమం కోసం ఎన్నారై పాలసీ తీసుకొస్తామని చాలా ఏళ్ళ క్రితం హామీ ఇచ్చింది కానీ దానిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. కుటుంబ సభ్యులు మాత్రం నిరక్షరాస్యులైన తమ వారిని గల్ఫ్ దేశాల నుంచి కాపాడి స్వదేశానికి తీసుకురావాలని తెలంగాణ సర్కార్ కి మొర పెట్టుకుంటున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నివాసురాలైన ఉషాభాను రెండేళ్ల క్రితం కువైట్ దేశానికి వెళ్లి ఉద్యోగం చేయడం ప్రారంభించింది. ఆమెకు నలుగురు కూతుళ్ళు ఉన్నారు. 12 రోజులుగా ఆమె కాంటాక్ట్ లో లేకుండా పోయారు. సహోద్యోగులను ఫోన్ ద్వారా ఆరా తీస్తే.. కనిపించకుండా పోయిందని వెల్లడించారు. దీంతో నలుగురు కూతుళ్లు తల్లడిల్లిపోతున్నారు. నిజామాబాద్ కు చెందిన రమేష్, ఉమాపతి ఇంకా చాలామంది తెలంగాణ వాసులు అంతూ పొంతూ లేకుండా పోయారు. దీంతో వారి కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. అధికారులు మాత్రం విశ్వసనీయ పరిచయాలు, అవగాహన లేకుండా గల్ఫ్ దేశాలకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: