ఇండియాలో కరోనా మహమ్మారి రెండో సారి విజృంభించడంతో ఇతర దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. తక్షణమే విమానాల రాకపోకలను నిలిపివేశాయి. సెకండ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గినప్పటికీ.. భారతీయులపై చాలా దేశాలు ప్రయాణ ఆంక్షలు  విధిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆమోదించబడిన టీకాలు తీసుకున్న భారతీయులను మాత్రమే అనుమతిస్తామని చాలా దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి.



ఈ నేపథ్యంలోనే దుబాయ్ కూడా భారతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ప్రయాణికులు తమతో పాటు కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తీసుకురావాలని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది. కొద్దిరోజుల తర్వాత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అవసరం లేదని.. కేవలం కోవిడ్ నెగిటివ్ రిపోర్టు తీసుకొస్తే సరిపోతుందని వెల్లడించింది. అయితే ఇప్పుడు మరొక ప్రకటన చేసింది. చెన్నై నుంచి దుబాయ్ కి వచ్చే ప్రయాణికులు కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ కూడా తీసుకురావాల్సిన అవసరం లేదని వెల్లడించింది.



భారతదేశం నుంచి దుబాయ్ కి ఈ నెల 6వ తేదీ నుంచి విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. కాగా ఇప్పుడు చెన్నై ప్రయాణికులకు దుబాయ్ తీపి కబురు అందిస్తూ.. నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాల్సిన అవసరం లేదని తెలిపింది. చెన్నై ప్రజలు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలకు సంబంధించి నెగిటివ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదని చెన్నై విమానాశ్రయ అధికారులు సైతం వెల్లడించారు.



అయితే అరబ్ దేశాల్లో దుబాయ్ మాత్రమే ప్రయాణ ఆంక్షల్లో ఎక్కువగా సడలింపులు ప్రకటించింది. మిగతా అన్ని అరబ్ దేశాల్లో కఠిన ప్రయాణ ఆంక్షలు అమలవుతున్నాయి. నిజానికి దుబాయ్ కూడా పూర్తి స్థాయిలో ప్రయాణం ఆంక్షలను ఎత్తివేయలేదు. ప్రస్తుతం భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్ కింద భారతీయులను దుబాయ్ కి తీసుకెళ్తుంది. ఇక అమెరికా, కెనడా లాంటి అగ్రదేశాలు ఇండియన్ స్టూడెంట్లకు ప్రయాణం సడలింపులు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లిపోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన వ్యాక్సింగ్ చేసుకున్న భారతీయులకు విదేశాల నుంచి ఎక్కువగా ఇబ్బందులు ఎదురు కావడం లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: