తాలిబన్ల దురాక్రమణ తర్వాత అఫ్ఘానిస్థాన్‌లో శాంతి భద్రతలు మరింత దిగజారుతున్నాయి. అక్కడి దేశ ప్రజలపై తూటాల వర్షం కురిపిస్తూ అరాచకత్వానికి తెరలేపారు. ఇండ్లలోకి ప్రవేశిస్తూ దౌర్జన్యం చేస్తున్నారు. దాంతో ఆ రాక్షస పాలన నుంచి బయట పడేందుకు అఫ్ఘన్ పౌరులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే అందరికీ ముందస్తుగా మిత్రదేశం భారతే గుర్తొస్తోంది. ఈ ఉద్రిక్త పరిస్థితులలో భారతదేశం కూడా అఫ్ఘన్ పౌరులకు వీసాలు జారీ చేసేందుకు పూర్తి సుముఖత చూపుతోంది. ఇండియన్ గవర్నమెంట్ వారి కోసం ప్రత్యేకంగా 'ఈ-వీసా' ప్రవేశ పెట్టిన సంగతి విధితమే.

విద్యా ప్రవేశం కోసం భారత దేశానికి రావాలి అనుకుంటున్న అఫ్ఘాన్ పౌరులు వీసాల కోసం దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. అయితే వారి దరఖాస్తులను త్వరితగతిన ట్రాక్ చేసేందుకు వీలుగా 'ఈ-ఎమర్జెన్సీ ఎక్స్‌-మిస్క్‌ వీసా' విధానాన్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ-వీసాలు తీసుకున్న పౌరులు 6 నెలల కాలం వరకు భారతదేశంలో నివసించవచ్చు.

తాజాగా భారత ప్రభుత్వం అఫ్ఘానిస్థాన్‌ పౌరలకు తీపికబురు అందిస్తూ ఈ-వీసాల జారీ విషయంలో ఒక ప్రకటన ఇచ్చింది. అఫ్ఘాన్ దేశ పౌర సమాజ సభ్యులతో సహా విద్యార్థులుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించింది. మహిళా కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలకు కూడా ఈ-వీసాల విషయంలో ప్రప్రథమంగా ప్రాధాన్యత ఇస్తామని భారతీయ ఉన్నతాధికారులు విస్పష్టం చేశారు. అఫ్ఘానిస్థాన్‌లో ఇండియా నేతృత్వంలో పూర్తి అయిన అభివృద్ధి, సంక్షేమ ప్రాజెక్టులకు సహాయం అందించిన ఆ దేశ పౌరులకు కూడా వీసాల జారీ దేశంలో తొలి ప్రాధాన్యం ఇస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు.

ఇకపోతే ఇంగ్లాండ్, కెనడా తదితర దేశాలు అఫ్ఘాన్ పౌరులకు ఆశ్రయం ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాలిబన్లు అఫ్ఘాన్ దేశాన్ని వశపరచుకున్న తర్వాత వేలాది మంది ప్రజలు ఇతర దేశాలకు తరలి వెళ్ళి పోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఆ దేశం లో చిక్కుకున్న ఇతర దేశస్తులు స్వదేశాలకు పయనం అవుతున్నారు. మన దేశం కూడా ప్రవాసులను పెద్ద ఎత్తున స్వదేశానికి తరలిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: