రాజ‌కీయ రుషి.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జీవితంలో చాలా మందికి తెలియ‌ని విష‌యాలు చాలానే ఉన్నాయి. అలాంటిలో ఆస‌క్తిక‌ర విషయం.. కాంగ్రెస్ అప్ప‌టి అధినేత్రి, ఏక ఛ‌త్రాధిప‌త్యంగా కాంగ్రెస్‌ను నియంత్రించిన నాయ‌కురాలు.. ఇందిర‌మ్మ‌కు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ద‌గ్గ‌ర కావ‌డం.. త‌ర్వాత ఆప్తుడు కావ‌డం.. ఆ త‌ర్వాత‌.. ``ఏపీ మేట‌ర్ షుడ్ డిస్క‌స్డ్ విత్ వైఎస్ జీ`` -అని ఆదేశించే వ‌ర‌కు ఆమె రావ‌డం వెనుక ఏం జ‌రిగింది? అప్ప‌టి వ‌ర‌కు ఇందిర‌మ్మ ద‌గ్గ‌ర కోట‌రీ క‌ట్టిన ఉమ్మ‌డి ఏపీ కాంగ్రెస్‌ నాయ‌కులు.. త‌ర్వాత అనూహ్యంగా వైఎస్‌కు ఎలా చేరువ అయ్యారు? అనే విష‌యాలు.. ఇప్ప‌టి త‌రానికి చాలా మందికి తెలియ‌దంటే.. ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది.

 

ఇందిర‌మ్మ అంటే.. ఇందిర‌మ్మే! కాంగ్రెస్‌లో ఆమె చెప్పిందే వేదం. దేశంలోని అప్ప‌టి 21 రాష్ట్రాల్లో  ఎక్క‌డ ఎలాంటి మార్పు జ‌ర‌గా ల‌న్నా.. ఎక్క‌డా ఎలాంటి చేర్పు చేయాల‌న్నా కూడా ఇందిర‌మ్మ ప్ర‌స్థావ‌న లేకుండా ఆమెతో చ‌ర్చించ‌కుండా జ‌రిగే ప్ర‌క్రియ లేనే లేదు. ఆమె గీసిన గీత దాటేందుకు కూడా ఎవ‌రూ సాహ‌సించేవారు కాదు! అలాంటి ప‌రిస్థితిలో ఎవ‌రూ చెప్ప‌కుండానే.. ఎవ‌రూ సిఫార‌సు లెట‌ర్లు ఇవ్వ‌కుండానే వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఇందిర‌మ్మ‌కు ద‌గ్గ‌ర‌య్యారు. అవి.. 1982-83 మ‌ధ్య నెల‌లు.. ఉమ్మ‌డి ఏపీలో కొత్త‌గా పుట్టుకొచ్చిన రాజ‌కీయ పార్టీ తెలుగు దేశం. అది కూడా ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వం అనే సెంటిమెంటు నినాదంతో తెర‌మీదికి వ‌చ్చిన పార్టీ. ఇందిర‌మ్మ ఆధిప‌త్యాన్ని ప్ర‌శ్నించేందుకు ఏర్పాటైన పార్టీ!

 

ఆ స‌మ‌యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ వీచికలు బ్రహ్మాండంగా వీస్తున్న ప‌రిస్థితి. 1978లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 294 అసెంబ్లీ స్థానాల‌కు గాను కాంగ్రెస్ ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా 175 స్థానాల‌ను కైవ‌సం చేసుకుని తిరుగులేని మెజారిటీతో అధికారం చ‌లాయిస్తున్న రోజులు. ఆ స‌మ‌యంలో అన్న‌గారు నంద‌మూరితార‌క‌రామారావు.. తారాజువ్వ‌మాదిరిగా రాజ‌కీయాల్లోకి దూసుకువ‌చ్చారు. ఆయ‌న‌ను నిలువ‌రించేందుకు ఇందిర‌మ్మ అనేక ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే, ప‌లించ‌లేదు. త‌ర్వాత 1983లో వ‌చ్చిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అందునా.. ఇందిర‌మ్మ ఫొటో చూస్తే..పూనకం వ‌చ్చిన‌ట్టుగా ఓట్లు కురిపించిన ప్ర‌జ‌లు కూడా పార్టీకి ఓటు వేయ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఒక్క‌సారిగా ఆ ఎన్నిక‌ల్లో 60 స్థానాల‌కు కాంగ్రెస్ దిగ‌జారిపోయింది.

 

ఆ త‌ర్వాత అనూహ్యంగా 1985లో ఎన్నిక‌లు వ‌చ్చాయి. అప్పుడు మ‌రింత‌గా కాంగ్రెస్ త‌న ప‌రిస్థితిని తానే దిగ‌జార్చుకుంది. అప్ప‌ట్లో 50 సీట్లు మాత్ర‌మే కాంగ్రెస్ ఖాతాలో ప‌డ్డాయి. జిల్లాల‌కు జిల్లాలు కాంగ్రెస్ నుంచి జారిపోయాయి. అయితే, ఒకే ఒక్క జిల్లా క‌డ‌ప‌లో మాత్రం కాంగ్రెస్ త‌న ప‌ట్టు నిల‌బెట్టుకుంది. అక్క‌డ మాత్రం 1983, 1985 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌న ప‌ట్టును గ‌ట్టిగా నిరూపించుకుంది. ఈ నేప‌థ్యంలో ఏపీ ఎన్నిక‌ల‌పై జ‌రిగిన‌రివ్యూలో క‌డ‌ప జిల్లాపై ఇందిర‌మ్మ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తుడిచి పెట్టుకుపోయినా.. ఈ జిల్లాలో ఎలా ప‌ట్టునిల‌బెట్టుకుంద‌నే ప్ర‌శ్న ఉద‌యించింది. ఈ క్ర‌మంలో ఆమె ప్ర‌త్యేకంగా క‌డ‌ప జిల్లా నేత‌ల‌ను ఢిల్లీకి పిలిపించుకుని చ‌ర్చించారు.

 

ఈ నేప‌థ్యంలో.. యువ నాయ‌కుడు, డాక్ట‌ర్‌.. వైఎస్ విష‌యం వెలుగు చూసింది. తాను గెల‌వ‌డ‌మే కాకుండా .. జిల్లా వ్యాప్తంగా ఆయ‌న కాంగ్రెస్‌ను ప‌రుగులు పెట్టించిన తీరును తెలుసుకున్న ఇందిర‌మ్మ‌.. త‌ర్వాత కాలంలో వైఎస్‌కు రాష్ట్ర పీసీసీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించి.. అధ్య‌క్షుడిని చేశారు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఎంపీగా టికెట్ ఇచ్చారు. అంతేకాదు.. ఇందిర‌మ్మ‌తో క‌లిసి లంచ్ పార్టీల్లో పాల్గొన్న అతి త‌క్కువ మంది నాయ‌కుల్లో ఏపీ నుంచి వైఎస్ ఉండ‌డం ఆయ‌న జీవితంలో కీల‌క విష‌యం. ఈ విష‌యాన్ని వైఎస్ జీవించిన‌న్నాళ్లూ చెప్పుకొన్నారు. అందుకే ఆయ‌న ప‌థ‌కాల‌కు `ఇందిర‌మ్మ` పేరు పెట్టుకున్నారు. కానీ నేటి త‌రానికి ఈ విష‌యం తెలియ‌దంటే.. ఒకింత ఆశ్చ‌ర్యంగానే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: