శత్రుశేషం ఉంచుకోకూడదనే రణ సూత్రాన్ని చంద్రబాబునాయుడు చాలా స్పష్టంగా పాటిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. పైగా విజయవాడ లోకల్‌ నాయకుల ఒత్తిళ్లకు ఆయన లొంగిపోయినట్లుగా కూడా కనిపిస్తోంది. వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకుండా.. శత్రు పార్టీకి చెందిన ఒక నాయకుడిని కటకటాల వెనక్కి పంపడానికి తెలుగుదేశం సర్కార్‌ అన్ని రకాలుగా వలపన్ని ప్రయత్నాలుచేస్తోంది. ఆ మేరకు విజయవాడలోని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును... బార్‌లో కల్తీ మద్యం తాగి 7 గురు మృతిచెందిన కేసుకు సంబంధించి... పోలీసులు అరెస్టు చేయబోతున్నారు. 


విజయవాడలో స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం కారణంగా ఏడుగురు మరణించగా, కనీసం 18 మందికి పైగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ నేరానికి సంబంధించి బార్‌ యజమానుల మీద కేసు బుక్‌ చేసిన విజయవాడ పోలీసు అధికారులు.. వారిలో ఒకరు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమీపబంధువుగా గుర్తించారు. 


నలుగురు యజమానుల్లో ఒక మహిళ పేరు మల్లాది బాలా త్రిపుర సుందరమ్మగా ఉండడంతో.. విష్ణుకు బంధుత్వం ఉండవచ్చునని ఆరాతీసి, నిగ్గు తేల్చారు. ఆ మేరకు ఆయనను కూడా విచారించడానికి విజయవాడ పోలీసు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది మల్లాది విష్ణు కార్యాలయానికి చేరుకున్నారు. బార్‌లో కల్తీ మద్యం రావడం వెనుక అసలు సూత్రధారులు ఎవరు.. ఈ రాకెట్‌ ఇంకా ఏయే ప్రాంతాలకు ఏ స్థాయిలో విస్తరించి ఉన్నది అనే సమస్త వివరాలను రాబట్టడానికే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడానికి పోలీసులు నడుం బిగించినట్లుగా తెలుస్తోంది. 


కక్షల కార్పణ్యాల రాజకీయాలకు వేదిక అయిన విజయవాడలో ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ నేత దొరకగానే పూర్తిగా బుక్‌ చేసేయాలని లోకల్‌ లీడర్స్‌ చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నారట. మరి వారి ఒత్తిడికి కూడా చంద్రబాబు పడిపోతున్నాడని ఆ మేరకు పోలీసుల్ని పురమాయించాడని కూడా పుకార్లు వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: