విజయవాడలోని తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును కల్తీ మద్యం కేసులో నిందితుడిగా చేర్చడంపై రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ కుతకుతలాడిపోతోంది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపణలు గుప్పిస్తోంది. ఒకవైపు ఈ కల్తీ మద్యం సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా సమీక్ష నిర్వహించి.. అధికార్లకు డైరక్షన్‌లు ఇస్తున్నారు. ఈ కేసులో తెర వెనుక నుండి దందాను నడిపిస్తున్న వారు ఎంతటి పెద్ద వారైనా విడిచిపెట్టే సమస్యే లేదని డీజీపీ రాముడు కూడా ప్రకటిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేరును ఈ కేసులో 9వ నిందితుడిగా జత చేయడం కూడా జరిగింది. దీనిమీదే కాంగ్రెస్‌ నాయకత్వం మండిపడుతోంది. 


కల్తీ మద్యం కారణంగా అయిదుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఇది మల్లాది విష్ణుకు సంబంధించిన బార్‌ అనేది ప్రచారంలోకి వచ్చేసింది. ఆయన బంధువు అయిన ఓ మహిళ పేరిట బార్‌ ఉంది. అయితే భవనం కూడా మల్లాది విష్ణు పేరిటే ఉంది. రకరకాల ఆధారాలను క్రాస్‌ చెక్‌ చేసుకున్న తరువాత.. మల్లాది విష్ణు పేరును కూడా నిందితుడిగా ఏపీ పోలీసులు చేర్చేశారు. 


అయితే ఈ విషయంలోనే కాంగ్రెస్‌ వారు ఉడికిపోతున్నారు. భవనం తన పేరిట ఉన్నంత మాత్రాన అతడు నిందితుడు ఎలా అవుతాడంటూ ప్రశ్నిస్తున్నారు. స్వయంగా బార్‌ నిర్వహణ వ్యవహారాలు మొత్తం తానే చూస్తున్నట్లు ఒప్పుకున్నాడు కూడా! 


కానీ ఏపీ సర్కారు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గానే తీసుకున్న మాట మాత్రం వాస్తవం. అదేదో మల్లాది విష్ణు కోసమే అని చెప్పలేం గానీ. కల్తీ మద్యం అనేది చాలా పెద్ద రగడగా మారిపోతున్నది గనుక.. ప్రభుత్వం పరువు మంటగలవకుండా ఉండేందుకు దీనిమీద కూలంకషమైన విచారణ జరుపుతున్నాం అనే ఫీలింగ్‌ను ప్రజలకు కలిగించడానికి సిట్‌ను కూడా ఏర్పాటుచేశారు. అసలే పార్టీ కునారిల్లుతున్న సమయంలో.. ఈ తరహా ఇండైరక్టు దాడులు మరింత దెబ్బగా మారుతాయేమోనని కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చెందడంలో ఆశ్చర్యం ఏముంది?


మరింత సమాచారం తెలుసుకోండి: