'ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న ' అనే సామెత తెలుగునాట కొత్తది కాదు. వ్యక్తులు చాలా వరకు ఇలాంటి వక్రసంబంధాలను కొనసాగిస్తూ ఉంటారు. అయితే సంస్థలు కూడా ఇదే బాట పడితే ఏం అనుకోవాలి. ఏది ఏమైనప్పటికీ.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం.. తాము నమ్మిన సూత్రం ఇదే అని నిరూపించుకుంటున్నది. ఒకవైపు సోనియా, రాహుల్‌ లు వేల కోట్ల రూపాయలు అక్రమంగా బొక్కేశారని కోర్టులు వారికి విచారణకు తాఖీదులు ఇస్తోంటే.. రాజకీయ కక్ష సాధింపు అంటూ వందిమాగధులంతా పెద్దపెట్టున గోలు చేస్తున్న వైనం మనం గమనిస్తూనే ఉన్నాం. అదే సమయంలో పార్టీలో కిందిస్థాయి చిన్న నాయకులు నేరారోపణల్లో ఇరుక్కున్నప్పుడు.. పార్టీకి పరువు పోకుండా ఉండేందుకు అక్కడితో వారిని వదిలించుకోవడానికే కాంగ్రెస్‌ సిద్ధపడుతున్నదని అనిపిస్తోంది. 


వరంగల్‌ ఎంపీ స్థానానికి ఉపఎన్నిక సందర్భంగా.. తొలుత అభ్యర్థిగా ఎంపికైన రాజయ్య ఇంట్లో ఆత్మహత్యలు జరిగిన వెంటనే.. కాంగ్రెస్‌ ఎలా స్పందించిందో అందరూ గమనించారు. రాజయ్య కోడలు, పిల్లల మరణాలు ఆత్మహత్య ద్వారా మాత్రమే సంభవించాయంటూ పోలీసులు కూడా నిగ్గు తేల్చారు గానీ.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం రాజయ్యకు అండగా నిలడడానికి ఇసుమంత కూడా ప్రయత్నించలేదు. ఆయనను అభ్యర్థిత్వం నుంచి తొలగించడం వేరు. కాకపోతే ఆ తర్వాత అయినా సరే.. రాజయ్య పట్ల కనీసం సానుభూతి వాక్యాలైనా పలికి.. ఆయనకు పార్టీ కూడా అండగానే ఉంటుందనే భావన కలిగించడం వేరు. రెండో పార్ట్‌ బాధ్యత నిర్వర్తించడంలో పార్టీ పట్టించుకోలేదు. 


ఇప్పుడు విజయవాడకు చెందిన స్వర్ణబార్‌.. కల్తీ మద్యం మరణాల దుర్ఘటన విషయంలో కూడా కాంగ్రెస్‌ పార్టీ అదే అవకాశ వాద ధోరణిని అవలంబిస్తున్నది. రాజయ్య ఇంట్లో దుర్ఘటన జరిగిన వెంటనే.. ఆయనను పార్టీనుంచి సస్పెండ్‌ చేసేసి.. అక్కడితో చేతులు దులిపేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ మల్లాది విష్ణు విషయంలో కూడా అదే పని చేయబోతోంది. ఆయనకు ప్రస్తుతం కీలకంగా ఉన్న విజయవాడ నగర పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పించి.. పార్టీకి ఆయనకు సంబంధం లేదనే సంకేతాలు ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాము తప్పించినట్లుగా కాకుండా, ఆయనతోనే రాజీనామా చేయించడానికి మాట్లాడుతున్నారుట. 


రాజయ్య కేసు ఎలా ఉన్నప్పటికీ.. మల్లాది విష్ణు కేసు వేరు. బార్‌ అధికారికంగా ఎవరి పేరిటో ఉంది, నిర్వహణ బాధ్యత తనది అంటూ మరొకరు లొంగిపోయారు, తప్పు పనివాళ్లు చేశారు.. మరి భవనం యజమాని మల్లాది విష్ణును ఎందుకు బుక్‌ చేస్తారంటూ కాంగ్రెస్‌ పోరాడవచ్చు. కానీ.. తాము సోనియమ్మ తప్పులు చేస్తే భజన చేస్తామే తప్ప కేడర్‌ తప్పులు చేస్తే.. ఎక్కడికక్కడ వదిలించేసుకుంటాం అంని కాంగ్రెస్‌ పార్టీ తన నైజం ప్రదర్శిస్తున్నట్లుగా కనిపిసస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: