విజయవాడకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇప్పుడు పీకల్దాకా కష్టాల్లో కూరుకుపోయారు. విజయవాడ స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం తాగి అయిదుగురు దుర్మరణం పాలు కావడం.. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా పరిగణించడం ఇప్పుడు మల్లాది విష్ణు మెడకు చుట్టుకున్నది. తొలుత బార్‌ బంధువులది అయినంత మాత్రాన మల్లాది విష్ణును కేసులో ఇరికించడానికి జరుగుతున్న ప్రయత్నం రాజకీయ కక్ష సాధింపు అంటూ కాంగ్రెస్‌ గోల చేయడానికి ప్రయత్నించింది గానీ.. ఇప్పుడు నోటికి తాళాలు వేసుకుంటున్నది. మల్లాది విష్ణు ప్రమేయానికి సంబంధించి ఆధారాలు కూడా పోలీసుల చేజిక్కుతున్నాయి. నెమ్మదినెమ్మదిగా మల్లాది విష్ణు చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. విజయవాడలో మల్లాది విష్ణుకు దశ తిరిగిందని చెప్పాలి. నగర రాజకీయాలకు పరిమితం అయి ఉన్న ఆయన ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఇప్పుడు స్వర్ణ బార్‌ ఉదంతంలో మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఆయన తనకు సంబంధం లేదంటూ ఎలా బుకాయించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఆయన సోదరుడు మల్లాది శ్రీనివాస్‌ స్వయంగా పోలీసుల ముందు లొంగిపోవడం వంటివి కీలకమైన అంశాలు. ఇప్పటిదాకా రికార్డుల ప్రకారం బార్‌ యజమానులుగా ఉన్న నలుగురు మహిళలో ఎవ్వరినీ అరెస్టు చేయకుండానే.. జరిగిన నేరానికి వాస్తవంగా బాధ్యులైన వారితోనే పోలీసులు విచారణ సాగిస్తున్నారు. 


తాజాగా సర్జికల్‌ స్పిరిట్‌ (మిథైల్‌ ఆల్కహాల్‌)ను బార్‌లో మద్యంతో కల్తీ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు.. ఇలా ఎప్పటినుంచో ఈ బార్‌లో కల్తీ జరుగుతూనే ఉన్నట్లు సిబ్బంది ద్వారా పోలీసులు ఆధారాలు సేకరించారు. సెల్లార్‌లో నడుస్తున్న బార్‌కు లైసెన్సులు రెన్యువల్‌ చేసినందుకు ఎక్సయిజ్‌ అధికారుల మీద కూడా చర్య తీసుకోనున్న ప్రభుత్వం మల్లాది విష్ణును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్‌ కూడా సైలెంట్‌ అయిపోయింది. పైగా అసలే రాజకీయ వ్యూహాలకు నెలవుగా ఉండే విజయవాడలో.. తెలుగుదేశం పార్టీ వారంతా ఈ అవకాశాన్ని వదులుకోకూడదని, శత్రువును పూర్తిగా మట్టుపెట్టేయాలని పార్టీ అధినేతపై ఒత్తిడి తెచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ అన్ని కారణాల దృష్ట్యా మల్లాది విష్ణు దీనినుంచి బయటపడడం కష్టం అని పలువురు భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: