ఆంధ్రప్రదేశ్ లో గత నెల విజయవాడ కృష్ణ లంకలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు..దాదాపు పదిహేను మంది వరకు తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో చేరారు. ఇకపోతే ఈ విషయంపై ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. దీంతో ప్రభుత్వం కల్తీ మద్యం కేసును సీరియస్ గా తీసుకుంది..స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్తీ మద్యం బాధితులను పరామర్శించారు.

దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. కాగా ఈ కల్తీ మద్యం కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పోలీసులు అరెస్ట్ చేశారు. సిట్ అధికారులు విష్ణును రెండు రోజులపాటు విచారించారు. అనంతరం ఈ రోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ చేశారు. మల్లాది విష్ణుతో పాటు ఆయన సోదరుడు, కల్తీ మద్యం ఘటన వెలుగు చూసిన కృష్ణలంక స్వర్ణ బార్ యజమాని మల్లాది శ్రీనివాస్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విజయవాడలో కల్తీ మద్యం వెలుగు చూసినప్పటి నుంచి మల్లాది నెల పాటు అండర్ గ్రౌండ్ వెళ్లిపోయి నాలుగు రోజుల క్రితం విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. బుధ, గురువారాల్లో దాదాపు 25 గంటల పాటు మల్లాది విష్ణును సిట్ పోలీసులు విచారించారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత మల్లాది సోదరులను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. రాత్రంతా తమ అదుపులోనే ఉంచుకున్న సిట్ పోలీసులు నేడు వారిద్దరినీ కోర్టులో హాజరుపరచనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: