ఉద్వేగం ఉవ్వెత్తున ఎగిసిప‌డింది..! ఉత్సాహం రెక్క‌లు విప్పింది..! డ‌బుల్ ధ‌మాకాలా ఒకే రోజు రెండు పండ‌గ‌లు జ‌రుపుకునే ఛాన్స్ ఇచ్చింది సాక్షి మాలిక్. రియో ఒలింపిక్స్2016లో పతకం కోసం ఆశగా ఎదురుచూస్తున్న భారత్‌కు కాంస్యం పతకం అందించి 125కోట్లమంది ప్రజలకు కొత్త సంబ‌రాలు మోసుకొచ్చింది సాక్షి మాలిక్. గురువారం దేశమంతా రాఖీ పండగను ఎంతో ఆనందంగా జరుపుకుంటుండగా సాక్షి తెచ్చిన పతకం ఆ ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఈ సంద‌ర్భంగా సాక్షికి స‌గ‌ర్వంగా స‌లాం చేస్తోంది ఏపీహెరాల్డ్. 


రియో ఒలింపిక్స్2016లో ప‌త‌కం కోసం భారతీయులు ఎదురుచూస్తున్నారు. ఒక్క పతకం రాక‌ కోట్ల మంది భారతీయులు నిరుత్సాహానికి గురవుతున్న వేళ.. ‘కుస్తీ మే సవాల్‌’ అంటూ బరిలోకి దిగింది. అంతులేని పట్టుదలతో బ‌రిలోకి దిగింది. కోట్లాది భారతీయుల ఆశ‌ల‌ను నిలిపింది, ఆనందాన్ని పంచింది.  హర్యానాకు చెందిన 23ఏళ్ల సాక్షి మాలిక్‌కు ఒలింపిక్స్‌లో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంటే, మెడ‌ల్ అందుకోవాలన్నది డ్రీమ్. అందుకోసం అల‌సిపోకుండా అహోరాత్రులు సాధన చేసింది. హరియాణాలోని రొహ్‌టక్‌కు దగ్గర్లోని మోఖ్రా గ్రామం ఆమె స్వస్థలం. చిన్నప్పటి నుంచీ ఆట‌లంటే అమితాసక్తి. 11 ఏళ్ల వరకు చదువు, ఆట పక్కపక్కన సాగాయి. ఆ తరవాత గ‌మ్యం ఎంచుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. ఒక్క క్షణం కూడా ఆలోచించ‌కుండానే. ‘కుస్తీకే నా ఓటు’ అంటూ నిర్ణ‌యం ప్ర‌క‌టించింది.  


సాక్షి నిర్ణ‌యంతో త‌ల్లి సుదేష్‌.. తండ్రి సుఖ్‌బీర్‌ ఆశ్చర్యపోయారు. ‘కుస్తీ అంటే మాటలు కాదు. చాలా కష్టపడాలి. దేహదారుఢ్యం కావాలి. పోటీలో గాయాలు అవుతాయి’ అని చెప్పి చూశారు. అవన్నీ మామూలే అన్నట్లు కన్నబిడ్డ మనసు తెలుసుకుని తనను ప్రోత్సహించేందుకు నిర్ణయించుకున్నారు. 12 ఏళ్ల వయసులో గురువు ఈశ్వర్‌ దహియా వద్ద ట్రైనింగ్‌లో చేరింది సాక్షి. ఆ క్రీడలో పట్టూ.. ఒడుపుల్ని నేర్చుకుంది. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో మెలకువల్ని అభ్యసించింది. అప్పటికి ఆమె ఉన్న ప్రాంతంలో కుస్తీ అబ్బాయిల క్రీడ మాత్రమే. ఆ ఆటను సాధన చేయాలన్నా.. సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలన్నా అబ్బాయిలతో పోటీ పడాల్సిందే.


అలా ట్రైనింగ్ పొందుతున్న ఆమెకు స్థానికులూ.. బంధువుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఇలాంటి పోటీలెందుకు? అని చాలామంది నిరాశ‌ప‌రిచారు. ఆ సమయంలో కోచ్‌ ఈశ్వర్‌ భుజం తట్టారు. ఆమెకు అండగా నిలిచాడు. ఇక సాక్షి దూకుడుకు అంతేలేదు. చిన్న‌చిన్న పోటీల్లో విజయాలు సాధించడం మొదలుపెట్టింది. గెలిచిన ప్రతిసారీ ‘బీట్‌ ద బెస్ట్‌’ అనుకుంది. ఈ విజయాలు ఆమెకి అభినందనల్ని తెచ్చిపెట్టాయి. తొలి రోజుల్లో విమ‌ర్శించి, నిరాశ‌ప‌రిచిన వారే ‘నీతో ఓ ఫొటో తీసుకుంటాం ప్లీజ్’ అనే పరిస్థితిని తీసుకొచ్చాయి. ద‌టీజ్ సాక్షి!


ఇంట‌ర్నేష‌న‌ల్‌ పోటీల్లో అడుగుపెట్టిన ఆమెకు తొలినాళ్ల‌లోనే విజయం వరించింది. 2010 జూనియర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకుంది. తరవాత 2014 డేవ్‌ షుల్జ్‌ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో స్వర్ణం సాధించి సత్తా చాటింది. అదే ఏడాది కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం గెలిచిన సాక్షికి ఒలింపిక్స్‌లో పతకమే టార్గెట్ అయింది. ముమ్మరంగా సాధన చేసింది. 2015 ఆసియా రెజ్లింగ్‌ పోటీల్లో కాంస్యం సొంతమయ్యాక.. సమ్మర్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌కి సన్నద్ధమైంది. అందులో కాంస్యం నెగ్గి రియోలో పోటీలకి అర్హత సాధించింది. 


కుస్తీలో భారత్‌కు ఒలింపిక్‌ పతకాన్ని అందించిన తొలి మహిళ హోదాలో మాట్లాడిన సాక్షి.. రెజ్లింగ్‌లో పతకం గెలిచిన తొలి భారతీయురాలిని తానేనవుతానని ఎప్పుడూ అనుకోలేదని. 12 ఏళ్లు పడ్డ కష్టానికి ఫలితం ఇదంటూ సంతోషంతో కన్నీటి పర్యంతమైంది. దేశ‌ప‌రువు నిలిపి కొత్త పండ‌గ‌ను తెచ్చిన సాక్షికి దేశ‌మంతా స‌లాం కొడుతోంది. 


సాక్షి సాధించిన 5 రికార్డులు 


1. రియో ఒలింపిక్స్-2016లో భారత్‌కు మొట్ట‌మొద‌టి పతకం అందించిన క్రీడాకారిణి 
2. 23 ఏళ్ల చిన్న‌ వయస్సులోనే ఒలింపిక్స్ గెలిచిన భారత రెజ్లర్‌గా సాక్షి రికార్డు సృష్టించింది.
3. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన
4వ మహిళా క్రీడాకారిణిగా సాక్షి రికార్డు సృష్టించారు. మిగితా ముగ్గురురిలో కరణం మల్లేశ్వరి(2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగిన పోటీల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్యం సాధించింది), మేరీ కోమ్ (2012లండన్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్ విభాగంలో కాంస్యం), సైనా నెహ్వాల్(2012లండన్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్యం) ఉన్నారు. 
5. సాక్షి.. ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలిసారే పతకం సాధించడం విశేషం.
 6. ఒలింపిక్స్ చరిత్రలో రెజ్లింగ్‌లో భారత్ తరపున తొలి పతకం సాధించిన క్రీడాకారిణి. ఆమె కంటే ముందు ముగ్గురు క్రీడాకారులు ఈ ఘనత సాధించారు. వీరిలో కేడీ జాద్(1952 హెల్సింకిలో కాంస్యం), సుశీల్ కుమార్(2008 బీజింగ్‌లో కాంస్యం, 2012లండన్‌లో రజతం), యోగేశ్వర్ దత్(2012లండన్‌లో కాంస్యం) ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: