కావేరి జలవివాదంపై రైతు, వాణిజ్య సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు తమిళనాడులో శుక్రవారం బంద్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఆత్మాహుతికి యత్నించి గాయపడిన నామ్‌ తమిళార్‌ కచి మద్దతుదారు శుక్రవారం మరణించాడు. రైతులు, వర్తక వ్యాపార సంఘాలు చేపట్టిన ఈ బంద్‌కు ప్రతిపక్షాలు పూర్తి మద్దతిచ్చాయి. రైల్‌రోకో, రాస్తారోకోలకు పలు చోట్ల జరిగిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకొన్నారు. ఆందోళనలకు దిగిన ప్రతిపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.20వేలకు పైగా చిన్న, మధ్య తరహా పారిశ్రామిక సంస్థలు మూతపడ్డాయి. 30వేలకు పైగా దుస్తుల ఫ్యాక్టరీలను మూసివేశారు. చెన్నైలో డిఎంకె నేత స్టాలిన్‌ నేతృత్వంలో ర్యాలీ జరిగింది.

ఎగ్మూర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద రైల్‌ రోకో నిర్వహించడానికి యత్నించిన స్టాలిన్‌, ఆయన మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  దుకాణాలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. చాలా చోట్ల స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. అయితే ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం మాములుగానే పనిచేశాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులు కూడా సాధారణంగానే తిరిగాయి.

ఇతర వాణిజ్య, ప్రైవేటు వాహనాలు మాత్రం తిరగలేదు. వీసీకే పార్టీ అధినేత టోల్ తిరుమావళన్‌ను, తిరుచిరాపల్ల్లిలో ఎండీఎంకే అధినేత వైకోను పోలీసులు నిర్భంధంలోకి తీసుకొన్నారు.  మరో నేత కనిమొళి పార్టీ మద్దతుదారులతో కలిసి అన్నాసెలై వద్ద రహదారిని దిగ్బంధించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: