బెజవాడ పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ ఇక్కడ రగులుతూనే ఉంటుంది. బెజవాడ వైసీపీలో చాలా కాలంగా ఇలాంటి రచ్చ రాజుకుంటూనే ఉంది. ఎప్పటికప్పుడు సద్దుమణుగుతుందని ఆశిస్తున్నా.. ఒకటి పోతే ఒకటి వెంటాడుతూనే ఉంటాయి. తాజాగా మరో తలనొప్పి జగన్ ను వెంటాడుతోంది. విజయవాడ వైసీపీలో మల్లాది విష్ణు, వంగవీటి రాధాల మధ్య గ్రూప్ తగాదాలు మళ్ళీ  బయటపడ్డాయి. కృష్ణా జిల్లా వైసీపీ రాజకీయ శిక్షణా తరగతులు ఇందుకు వేదికయ్యాయి. విష్ణు, రంగా అనుకూల నినాదాలతో సమావేశంలో గందర గోళం నెలకొంది. విషయం పార్టీ పెద్దల వరకు వెళ్లింది.

 Image result for malladi vishnu vs vangaveeti radha

జిల్లా స్థాయి వైసీపీ బూత్ కన్వీనర్ల  శిక్షణా తరగతులు విజయవాడలో జరుగుతున్నాయి. నియోజక వర్గాల వారీగా నియోజక వర్గ ఇన్ ఛార్జులు, కార్యకర్తలు ఇందులో పాల్గొంటున్నారు.  బుధవారం జరిగిన కార్యక్రమంలో నాయకులను వేదిక పైకి ఆహ్వనించిన వెల్లంపల్లి విష్ణును మాత్రం ఆహ్వానించలేదు.  కొంత సేపటి తర్వాత తప్పు తెలుసుకున్న వెల్లంపల్లి వేదికపైకి రావాలని విష్ణును ఆహ్వానించారు. కానీ విష్ణు మాత్రం అందుకు నిరాకరించారు. ఇదే సమయంలో రాధాను వేదికపైకి ఎందుకు పిలవలేదని ఆయన అనుచరులు గొడవ చేశారు. దీంతో ఇరు వర్గాలు తమ నాయకులకు అనుకూలంగా నినాదాలు చేశాయి. అయితే విష్ణు కల్పించుకుని రెండు వర్గాలను సముదాయించారు. ఈ గొడవ జరిగిన కొద్ది సేపటికి రాధా సమావేశానికి హాజరయ్యారు.

 

మూడు రోజులుగా జరుగుతున్న శిక్షణా తరగతుల్లో వైసీపీ సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు జిల్లా పార్లమెంట్ బాధ్యులు పాల్గొంటున్నారు. కానీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్న రాధా మాత్రం మంగళవారం వరకు హాజరు కాలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విష్ణు, రాధాల మధ్య ఉన్న విభేదాలు పార్టీ పెద్దల ముందే బహిర్గతం కావడం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.  ఇదే సమయంలో సమావేశంలో జరిగిన ఆందోళనపై వివరణ ఇచ్చేందుకు విష్ణు నిరాకరించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. నాయకుల విభేదాలను అధిష్ఠానమే పరిష్కరించాలని ఆశిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: