వైసిపికి సంబంధించి ఈ మ‌ధ్య కాలంలో ఇంత‌గా వివాదాల్లో న‌లిగిన నియోజ‌క‌వ‌ర్గం ఇంకోటి లేద‌నే చెప్పాలి.  రాష్ట్రంలోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల మ‌ధ్య పోటీ ఉన్న‌ప్ప‌టికీ ఈ స్ధాయిలో మాత్రం ర‌చ్చ జ‌ర‌గ‌లేదు. ఇదంతా ఏ నియోజ‌క‌వ‌ర్గంలో అంటే విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోనే అన్న విష‌యం అర్ధ‌మైపోయుంటుంది. వారం రోజులుగా సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంపై వివాదం  జ‌రుగుతుండ‌టంతో ఇపుడందరు వంగ‌వీటి రాధాకృష్ణ అలియాస్ రాధా రాజ‌కీయ భ‌విష్య‌త్ పైనే చ‌ర్చించుకుంటున్నారు. 


రాధాలో ఆందోళ‌న‌


వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేయాల‌ని రాధా గ‌ట్టి ప‌ట్టుమీదున్నారు. కానీ అదే నియోజ‌క‌వ‌ర్గంలో ఎంఎల్ఏగా ప‌నిచేసిన మ‌ల్లాది విష్ణుని వైసిపిలో చేర్చుకున్నారు. అప్ప‌టి నుండి రాధాలో ఆందోళ‌న మొద‌లైంది. చాలా కాలంగా పార్టీ నాయ‌క‌త్వంతో కూడా రాధా అంటీ ముట్ట‌న‌ట్లే ఉంటున్నార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇటువంటి నేప‌ధ్యంలోనే రాధాను విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో కానీ లేక‌పోతే మ‌చిలీప‌ట్నం ఎంపిగా గానీ పోటీ  చేయాల‌ని పార్టీ అధిష్టానం సూచించింది. 


2004లో తూర్పు నుండే గెలిచారు


ఎందుకంటే, రాధా 2004లో తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుండే గెలిచారు. అందులోను కాపుల ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోనే ఎక్కువ‌. అందుకే తూర్పులో పోటీ చేయ‌మ‌ని జ‌గ‌న్ సూచించారు. కానీ అందుకు రాధా సుముఖంగా లేర‌ని తెలిసిపోతోంది. అదే స‌మ‌యంలో  సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో టిక్కెట్టు ఇవ్వ‌టానికి జ‌గ‌న్ కూడా సిద్ధంగా లేరన్న‌ది వాస్త‌వం. మ‌రి ఇటువంటి ప‌రిస్ధితుల్లో రాధా ముందున్న ఆప్ష‌న్లు ఏంటి ?


పార్టీ చెప్పిన‌ట్లు విన‌ట‌మేనా ?


ఇపుడిదే మిల‌య‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న అయిపోయింది. పార్టీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం రాధా ముందు మూడు ప్ర‌త్యామ్నాయాలున్నాయ‌ట‌. ఒక‌టి పార్టీ చెప్పిన‌ట్లు తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేయ‌టం. రెండోది మ‌చిలీప‌ట్నం ఎంపిగా పోటీ చేయ‌టం. ఈ రెండు ఇష్టం లేక‌పోతే పార్టీకి గుడ్ బై చెప్పేయ‌టం. పార్టీకి గుడ్ బై చెప్పేస్తే ఏ పార్టీలో చేరాల‌న్న‌దే పెద్ద స‌మ‌స్య‌. రాధాను చేర్చుకోవ‌టానికి  పార్టీలు సిద్ధంగా ఉన్నా భ‌విష్య‌త్తుపైనే భ‌రోసా లేదు. ఆ విష‌యంలో రాధాకు బాగానే క్లారిటీ ఉంది. అందుకే ఏం చేయాలో తేల్చుకోలేక గుంభ‌నంగా ఉంటున్నారు.


ఏ పార్టీలో చేరినా అంతంత మాత్ర‌మే


టిడిపిలో చేర‌లేరు. ఎందుకంటే, త‌న తండ్రి వంగ‌వీటి రంగాను చంపించిందే టిడిపి అని అంద‌రికీ తెలుసు. రంగా హత్య‌లో కీల‌క ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్న వారి ద‌గ్గ‌ర ప‌నిచేయ‌టానికి రాధా గ‌నుక అంగీక‌రించినా జ‌నాలు ఎలా రియాక్ట్ అవుతారో ఊహించ‌లేరు. కాబ‌ట్టి టిడిపిలోకి వెళ్ళే అవ‌కాశాలు లేవ‌నే చెప్ప‌చ్చు. ఇక‌, జ‌న‌సేన‌లో చేరాలంటే ఆ పార్టీ నిర్మాణ‌మే స‌క్ర‌మంగా లేదు. అది అవ‌టానికి కాపుల పార్టీ అనే ప్ర‌చార‌మున్నా భ‌విష్య‌త్తు అంతంత మాత్ర‌మే. ఇక‌, కాంగ్రెస్, బిజెపిల్లో చేరినా పెద్ద ఉప‌యోగమైతే  ఉండ‌దు. అన్నీ విష‌యాల‌ను భేరీజు వేసుకునే ప్ర‌స్తుతానికి రాధా మౌనంగా ఉంటున్న‌ట్లు స‌మాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: