రాజకీయ రాజధాని విజయవాడలో సెంటర్‌గా ఉన్న నియోజకవర్గం సెంట్రల్. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన సెంట్రల్‌లో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి మల్లాది విష్ణు గెలవగా...2014లో టీడీపీ ఫైర్ బ్రాండ్ బొండా ఉమా విజయం సాధించారు. ఇక ఈ ఎన్నికల్లో తెదేపా నుండి ఉమా...వైకాపా నుండి విష్ణు బరిలో ఉన్నారు. అయితే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి బొండా విజయం అంత సులువు కాదు. ఇక్కడ వైకాపా కూడా బలపడింది.


అయితే నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు బాగానే అమలు చేసిన ఉమా...ఎక్కువ దూకుడుగా వెళ్లతారనే టాక్ ఉంది. అటు వైసీపీ కూడా గట్టిగా ఉండటం ఉమాకి మైనస్ కానున్నాయి. కానీ ప్రజలకు సమస్య వస్తే వెంటనే పరిష్కరిస్తారని ఉమా మీద ప్రజలకు మంచి అభిప్రాయం ఉంది. ఇక వైకాపా కూడా వ్యూహాత్మకంగా నియోజకవర్గంలో 40 వేల బ్రాహ్మణ ఓటర్లు ఉండటంతో మల్లాది విష్ణుని ఉమా మీద పోటీకి దింపింది. ఉమా మీద ఉన్న మైనస్ పాయింట్లు విష్ణుకి పాజిటివ్ కానున్నాయి. కానీ మొన్నటివరకి వైకాపా లో ఉన్న వంగవీటి రాధా టీడీపీలో చేరడం విష్ణుకి మైనస్ కానుంది. ఇక్కడ రాధా అనుచర వర్గం ఉమాకి మద్ధతు తెలపనుంది.

పైగా జనసేన పొత్తులో భాగంగా ఈ సీటుని సీపీఎం బాబురావుకి ఇచ్చింది. ఉమాకి పవన్‌తో ఉన్న సాన్నిహిత్యం వలనే జనసేన పోటీ చేయలేదనే ప్రచారం కూడా ఉంది. ఇక ఇక్కడ సీపీఎం పోటీ చేయడం....ఉమాకే కలిసిరానుంది. ఇక్కడ ఎక్కువ ఉన్న కాపు ఓటర్లు ఉమావైపే మొగ్గు చూపుతారు. ఏది ఏమైనా ఇక్కడ ఉమా...విష్ణుల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయం. ఇద్దరికీ గెలుపు అవకాశాలు ఉన్నాయ‌ని ఎవ‌రి లెక్క‌ల్లో వారు మునిగి తేలుతున్నారు.

ఇద్ద‌రు నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టున్న వ్య‌క్తులే. ప్ర‌స్తుతం ఉమా ఎమ్మెల్యేగా ఉంటే విష్ణు గ‌తంలో ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వంగ‌వీటి రాధా సైతం 2004లో ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాధా ఇప్పుడు టీడీపీలో ఉండ‌డంతో పాటు సెంట్ర‌ల్‌లో వైసీపీ ఓట‌మే ధ్యేయంగా క‌సితో ఉన్నారు. మ‌రి ఈ స‌మీక‌ర‌ణ‌లు ఎలా మార‌తాయో ?  చూడాలి. ఇక ప్ర‌చారం విష‌యానికి వ‌స్తే ఇద్దరు నేతలు పోటాపోటిగా ప్రచారం చేస్తూ ఓట్లు వేయమని జనం దగ్గరకి వెళుతున్నారు. మరి ఎన్నికల సమయంలో ఓటర్లు ఎక్కువ ఎవరివైపు మొగ్గుచూపుతారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: