రాజకీయ రాజధాని విజయవాడ నగరానికి నడిబొడ్డున ఉన్న నియోజకవర్గం సెంట్రల్. 2009లో కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మల్లాది విష్ణు పోటీ చేసి గెలుపొందారు. ఇక 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన బోండా ఉమా...వైసీపీ అభ్యర్ధి గౌతంరెడ్డిపై 27 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ సారి కూడా బోండానే టీడీపీ నుంచి పోటీ చేస్తుండగా...2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి వచ్చిన మల్లాది విష్ణు వైసీపీ తరుపున పోటీ చేస్తున్నారు. జనసేన పొత్తులో భాగంగా సీపీఎం అభ్యర్ధి బాబూరావు బరిలో ఉన్నారు. అయితే టీడీపీ, వైసీపీ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు.


ఇక టీడీపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయిన బోండా ఉమా...ఈ ఐదేళ్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించారు. నగర ప్రాంతం అవడం, ఆ పైగా రాజధాని అమరావతికి దగ్గరగా ఉండటంతో ఇక్కడ అభివృద్ధి వేగంగా జరిగింది. అన్నీ వర్గాలకి సంక్షేమ పథకాలు అందేలా చేశారు. సమస్య వస్తే ఉమా వెంటనే పరిష్కరిస్తారనే మంచి అభిప్రాయం ఇక్కడ ప్రజల్లో ఉంది. అలాగే సెంట్రల్‌లో పట్టున్న వంగవీటి రాధా టీడీపీలో చేరడం కలిసొచ్చే అంశం.  అయితే దూకుడుగా వ్యవహరించడం, నగరంలో భూకబ్జాలు చేశారనే ఆరోపణలు రావడం ఉమాకి మైనస్ అయ్యే అవకాశం ఉంది.


వైసీపీ నుంచి పోటీ చేస్తున్న మల్లాది విష్ణుకి నియోజకవర్గంపై మంచి పట్టుంది. 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది. ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉండటం...వైసీపీకి బలం పెరగటం విష్ణుకి కలిసొచ్చే అంశాలు. కానీ మొన్నటివరకు వైసీపీలో ఉన్న రాధా టీడీపీలో చేరడం విష్ణుకి కొంత ఇబ్బందనే చెప్పాలి. ఇక జనసేన పొత్తులో భాగంగా సీపీఎం పోటీ చేస్తుంది. ఆ పార్టీ అభ్యర్ధి బాబురావుకి నియోజకవర్గంపై కొంత పట్టుంది. పవన్ అభిమానుల మద్ధతు కూడా కొంత ఉండొచ్చు..కానీ గెలిచే అంత కెపాసిటీ అయితే సీపీఎంకి లేదు.


ఈ నియోజకవర్గం మొత్తం విజయవాడ నగర ప్రాంతంలో ఉంది. ఇక్కడ బీసీలు, ఎస్సీలు, కాపు, బ్రాహ్మణ సామాజికవర్గాల ఓట్లు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ఉమా కాపు సామాజికవర్గ నేత కాగా, విష్ణు బ్రాహ్మణ సామాజికవర్గ నేత. దీంతో ఎవరు ఎవరికి ఎక్కువ మద్ధతు ఇస్తారో తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రచారంలో కూడా నేతలు ఈ కులాల ఆధారంగానే రాజకీయాలు నడుపుతున్నారు. 2014 ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజికవర్గం టీడీపీ వైపే మొగ్గుచూపింది. ఉమా కూడా బ్రాహ్మణ వర్గానికి అన్నీ రకాలుగా సాయం చేశారు. అయితే బ్రాహ్మ‌ణ సామాజిక‌వ‌ర్గం ఈ సారి మ‌ళ్లీ త‌మ వ‌ర్గానికి చెందిన విష్ణుకు ప్ర‌ధాన పార్టీ వైసీపీ సీటు ఇవ్వ‌డంతో అటు వైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.


ఇక కాపులు ఉమా వైపే ఉంటారు...బీసీ, ఎస్సీలు రెండు పార్టీలకి మద్ధతు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్నికల్లో జరిగే పరిణామాలు బట్టి గెలుపోటములు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఇద్దరు నేతలు పోటాపోటిగా తలపడుతున్నారు. మరి చూడాలి ఎన్నికల్లో కుల సమీకరణలు, పార్టీల మేనిఫెస్టోలు, హామీలు ప్రజలపై ఏ మేర ప్రభావం చూపుతాయో...ఎవరిని గెలిపిస్తాయో. అయితే ఐదేళ్ల‌లో సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో బొండా అండ‌తో పేట్రేగిన రౌడీయిజం మాత్రం నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ఎన్నిక‌ల్లో ఎంతైనా ప్ర‌భావం చూప‌నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: