సమాజంలో మంచివారుగా బ్రతుకుతున్న వారు కొన్ని కొన్ని పరిస్దితులవల్ల దొంగలుగా మారవలసి వస్తుంది. ఇలా ఎందుకు మారారు అంటే అలాంటి వారు చెప్పే కారణాలు బోలెడు ఉంటాయి. కారణం ఏదైన వారు చేసే పని మాత్రం తప్పే. ఇకపోతే కొందరు తమ యింట్లోనే తాము దొంగతనానికి పాల్పడుతుంటారు. ఎక్కువగా ఇలాంటివి చదువుకునే పిల్లల్లో చూస్తుంటాము. ఇక పెళ్లి తర్వాత పెళ్లైన ఆడపిల్లకు సర్వస్వం భర్తనే అంటారు. కష్టంలో సుఖంలో తోడుగా ఉంటామని ప్రమాణాలు కూడ చేస్తారు. ఇలాంటి సమాజంలో కట్టుకున్న భర్త కంట్లో కారం కొట్టి అత్త వారింట్లోనే దొంగగా మారింది ఓ మహిళ.


ఇక ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడు అంటారు. కాని 80 లక్షల విలువ చేసే సొత్తును కాజేసి ఏం తెలియనట్లుగా నాటకాలాడిన ఈ మహిళను పోలీసులు వారం రోజుల్లో పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి పరిధిలో జరిగిన ఈ దొంగతనం కేసు వివరాలను సోమవారం అంటే అక్టోబర్ 28 హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఇకపోతే ఈ మహిళ తన సొంత ఇంట్లోనే దొంగగా మారడం షాక్‌కు గురి చేస్తే అందుకు ఆమె చెప్పిన కారణం కూడా మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. 


ధీరజ్ అనే వ్యక్తి బోయిన్‌పల్లిలో తన భార్య సుప్రియా, తల్లి సరళతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నారు. అయితే అతడి ఇంట్లో అక్టోబర్ 21న దొంగతనం జరిగింది. డూప్లికేట్ తాళంచెవితో ఇంటి తాళం తీసి చోరీకి పాల్పడి, రూ.80 లక్షల విలువ చేసే 2 కిలోల బంగారు అభరణాలు, 6.5 కిలోల వెండి అభరణాలతో పాటు ఒక వ్యాగనార్ కారు, 4 సెల్ ఫోన్లు దోచుకెళ్లారు. ఈ విషయంలో బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేశారు. దీనిలో భగంగా సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి నిందితుల ఆనవాళ్లు గుర్తించి చివరకు ధీరజ్ భార్య సుప్రియే ఈ చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు.


ఇందుకు గాను  సుప్రియకు ఆమె తల్లిదండ్రులు, సోదరుడు సహకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అక్టోబర్ 21న సుప్రియ అత్త తన కుమారుడిని సికింద్రాబాద్‌లో డ్రాప్ చేయడానికి కారులో బయల్దేరి వెళ్లారు. ఇదే అనువైన సమయంగా భావించిన సుప్రియ డూప్లికేట్ తాళంచెవితో ఇంటి తాళం తీసి ఓ పథకం ప్రకారం దొంగతనానికి పాల్పడింది.


ఈ దొంగతనం విషయంలో సుప్రియను ప్రశ్నించిన పోలీసులకు తన భర్త తనతో సరిగా కాపురం చేయట్లేదని, పెళ్లైన నాటి నుంచి ఎప్పుడూ వివాదాలే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.  అత్తింటి తీరుతో విసుగు చెంది దొంగతనం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడైన కోడలు సుప్రియతో పాటు, ఆమె తల్లిదండ్రులను, సోదరుడు సాత్విక్‌ను పోలీసులు అరెస్టు చేశారు...


మరింత సమాచారం తెలుసుకోండి: