ఏపీలో జగన్ ప్రభుత్వం అన్నీ విధాలుగా విఫలమైందని చెబుతూ...టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో, ప్రజా చైతన్య యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రకాశం జిల్లా పర్చూరు, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాల్లో యాత్ర చేసిన బాబు..ఇప్పుడు ఉత్తరాంధ్ర టూర్‌కు సిద్ధమయ్యారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నుంచి పెందుర్తి వెళ్ళి, అక్కడ నుంచి విజయనగరం జిల్లాకు వెళ్ళి అక్కడ ప్రజా చైతన్య యాత్ర చేయనున్నారు.

 

అయితే జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో విశాఖ వైసీపీ శ్రేణులు, బాబుని అడ్డుకుంటామని ఇప్పటికే ప్రకటించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం మీడియా సాక్షిగా బాబుని అడ్డుకోవాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ శ్రేణులు చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక అక్కడే ఉన్న టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఉండటంతో, ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, ఇరువర్గాలకు సర్ది చెప్పి పంపేశారు.

 

కానీ వైసీపీ శ్రేణులు అడ్డుకోవడం వల్ల బాబు పర్యటన హైలైట్ అయింది. రాష్ట్ర ప్రజల ఫోకస్ బాబు టూర్ మీదకి వెళ్లింది. అయితే బాబు టూర్ చివరి వరకు ఏదో రకంగా అడ్డుకోవడానికి వైసీపీ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ శ్రేణులు ఇలా చేయడం బాబుకే ప్లస్ అవుతుంది. ఆయన మీద సానుభూతి పెరిగే అవకాశం ఉంటుంది. పైగా ఇన్నిరోజులు ఉత్తరాంధ్రలో స్తబ్దుగా ఉన్న టీడీపీ కేడర్ ఇంకా పుంజుకునే ఛాన్స్ ఉంటుంది.  వైసీపీ శ్రేణుల హడావిడితో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంతో ప్రజా చైతన్య యాత్రని సక్సెస్ చేసేందుకు రెడీ అయ్యారు.

 

అసలు వైసీపీ శ్రేణులు ఇలా హడావిడి చేయకుండా సైలెంట్‌గా వదిలేస్తే, ఉత్తరాంధ్ర ప్రజలే బాబుకు మద్ధతు ఇవ్వాలో లేదో తేల్చుకునే వారు. బాబు యాత్రకు జనం రాకపోతే ఆయన్ని వ్యతిరేకించినట్లే అవుతుంది. ఒకవేళ భారీగా ప్రజలు వస్తే పరిస్తితి వేరుగా ఉంటుంది. ఏదేమైనా చంద్రబాబు యాత్ర సంగతి ప్రజలకు వదిలేస్తే సరిపోయేది. అనవసరంగా వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేసి, బాబుని బాగా హైలైట్ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: