ఆంధ్రప్రదేశ్‌లో సీఏఏ అమలు చేయకుండా సీఎం జగన్‌ నిర్ణయం తీసుకోవాలని ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ డిమాండ్‌ చేశారు. జగన్ తండ్రి వైఎస్సార్‌ బతికుంటే కేవలం రెండే నిమిషాల్లో సీఏఏ పై రాష్ట్రంలో స్టే విధించేవారని అన్నారు. గుంటూరు బీఆర్‌ స్టేడియంలో సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఎస్సీ,ఎస్టీ, బీసీ , మైనార్టీలు నిర్వహించిన సింహగర్జన సభకు ఎంఐఎం  జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ హాజరయ్యారు. ఈ సభకు వచ్చిన స్పందన చూసైనా సీఎం జగన్‌ సీఏఏ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

 


జగన్ తీరుపై మండిపడిన అసుదుద్దీన్  సీఎం జగన్‌ ప్రధానిని చూసి భయపడుతున్నారని అన్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానున్న ఎన్‌పీఆర్ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్‌లో నిలుపుదల చేసేందుకు సిద్ధం కావాలన్నారు. ఎన్‌పీఆర్‌ను నిలిపివేయడం అత్యవసరం... ఇవాళ వైఎస్సార్‌ బతికుంటే... ఎన్‌పీఆర్‌ను నిలిపివేయడానికి ఆయన రెండు నిమిషాలైనా ఆలోచించేవారు కాదు... ఏపీ సీఎం జగన్‌ మన మాటలను పెడచెవిన పెట్టి... భాజపా, ప్రధాని మోదీ అంటే ఉన్న భయంతో ఏపీలో ఎన్‌పీఆర్‌ను అనుమతిస్తే... దాన్ని మేం బహిష్కరిస్తాం. దాన్ని మేం స్వాగతించబోం... అని తేల్చి చెప్పారు.  

 

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్‌ ముస్తఫా మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సీఏఏ, ఎన్నార్సీ లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెడుతుందని లేని పక్షంలో తన పదవికే రాజీనామా చేస్తానని సవాల్‌ చేశారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్ కు వ్యతిరేకంగా సీఎం జగన్‌ తప్పక తీర్మానం చేస్తారని అలా చేయని పక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ప్రకటించారు.  గుంటూరులో జరిగిన ఈ సభకు మహారాష్ట్ర పీపుల్స్‌ రిపబ్లిక్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జోగేంద్ర కవాడే హాజరయ్యారు..

మరింత సమాచారం తెలుసుకోండి: