ప్ర‌స్తుతం ఏపీ గిరిజ‌న సంక్షేమ శాఖా మంత్రి, డిప్యూటీ సీఎంగా ఉన్న పాముల పుష్ప శ్రీవాణి నిజంగానే రికార్డుల రారాణి... మ‌హారాణి అని చెప్పాలి. అత్యంత సాధార‌ణ కుటుంబంలో జ‌న్మించిన ఆమె త‌న‌కున్న నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో పాటు భ‌ర్త ప్రోత్సాహం, భ‌ర్త కుటుంబం నుంచి రాజ‌కీయ వార‌స‌త్వం రావ‌డంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆరేళ్ల‌కే ఏకంగా మంత్రి అవ్వ‌డంతో పాటు ఉప ముఖ్య‌మంత్రి అయ్యారు. పుష్ప శ్రీవాణి  పశ్చిమ గోదావరి జిల్లా, బుట్టాయగూడెం మండలం దొరమామిడి గ్రామంలో జన్మించారు. ఆమె ప‌దో తరగతి వరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదివారు.



ఆ త‌ర్వాత ఇంటర్‌ జంగారెడ్డిగూడెం సూర్య కళాశాలలో, డిగ్రీ అక్కడి ఉమెన్స్‌ కళాశాలలో, విశాఖలో బీఈడీ పూర్తి చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలోనే ఏడాదిన్నరపాటు ఉపాధ్యాయురాలుగా పనిచేసిన ఆమె ఆ త‌ర్వాత విజ‌య‌న‌గ‌రం జిల్లా గిరిజ‌న రాజ‌వంశీయుల ఇంట్లో కోడ‌లిగా అడుగు పెట్టింది. ఉన్న‌త విద్య అభ్య‌సించిన ఆమె భ‌ర్త ఫ్యామిలీ రాజ‌కీయంగా ఉన్నత స్థానాల్లో ఉండ‌డంతో 2014 ఎన్నిక‌ల్లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో కురుపాం నుంచి వైసీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేశారు.



ఆ ఎన్నిక‌ల్లో కురుపాం శాసనసభా నియోజకవర్గం నుంచి వైసీపీ త‌రుపున పోటీ చేసి 19,083 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్యర్థి నరసింహ థాట్రాజ్‌పై 26, 602 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ క్ర‌మంలోనే 2019, జూన్ 8న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆమె గిరిజ‌న సంక్షేమ శాఖా మంత్రి ప‌ద‌వితో పాటు, ఎస్టీ కోటాలో ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి సైతం ద‌క్కించుకున్నారు.



రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు, మ‌హిళా కోటా, జ‌గ‌న్‌ను న‌మ్మ‌డం ఇవ‌న్నీ ఆమెను త‌క్కువ టైంలోనే ఉన్న‌త స్థానంలో కూర్చోపెట్టాయి. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆరు ఏళ్ల‌కే ఆమె రెండు సార్లు ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో పాటు మంత్రి ప‌ద‌వితో పాటు ఉప ముఖ్య‌మంత్రి ద‌క్కించుకున్న మ‌హిళ‌గా రికార్డుల‌కు ఎక్కారు. తెలుగు రాజ‌కీయాల్లోనే కాదు దేశ రాజ‌కీయాల్లోనే ఈ అరుదైన రికార్డు ఆమెకే సొంత‌మైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: