లాక్‌డౌన్‌తో తెలంగాణలో ఇళ్ల మీటర్‌ రీడింగ్ నమోదు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయ్‌ విద్యుత్ సంస్థలు. దీంతో కరెంట్ బిల్లులు చెల్లింపు ఆగిపోవడంతో భారీ నష్టాలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.  దీని నుంచి బయటపడేందుకు కొత్త పద్ధతిని తెరలేపాలని భావిస్తున్నాయ్‌. ఇంతకీ అదేంటి? దానివల్ల లాభమా? నష్టమా? 

 

దేశ వ్యాప్తంగా గడిచిన నెలరోజులుగా లాక్‌డౌన్‌ ఆంక్షలతో కరెంటు మీటరు రీడింగుల నమోదును డిస్కంలు తాత్కాలికంగా వాయిదా వేశాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో భారీ నష్టాలను చవిచూస్తున్నాయ్‌ విద్యుత్‌ సంస్థలు. ఇప్పటికే ఆన్ లైన్, మొబైల్ యాప్‌ల ద్వారా బిల్లులను చెల్లించాలని డిస్కంలు సూచించాయి. వీటికి తోడు మరో కొత్త పద్ధతి తెరమీదకొచ్చింది. ఎవరి ఇంటి మీటరు ఫొటో వారే ఫోన్‌లో తీసి ఆన్‌లైన్‌లో పంపితే ప్రోత్సాహకాలు ఇస్తామని నార్త్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ప్రటించింది. దీంతో అదే పద్దతిని తెలంగాణలో అమలు చేయాలని భావిస్తున్నాయ్‌ విద్యుత్‌ సంస్ధలు.

 

విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాలను తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. గతంలో విద్యుత్ ప్రిపేయిడ్ మీటర్ల పైలెట్ ప్రాజెక్టును రాష్ట్రంలో చేపట్టింది. ఇది విజయవంతం అయితే వినియోగదారులు ఈ మీటర్లను కొనుగోలు చేయాలని సూచించారు. కానీ ఒక్కో ప్రి పెయిడ్ మీటర్ ధర సుమారు 8 వేల రూపాయలు ఉండటంతో వినియోగదారులు ముందుకు రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ప్రి పెయిడ్ మిటర్లను వాడుతున్నారు. వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, ఎంత కరెంట్ వినియోగిస్తే అంతే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. కరోనా లాక్‌డౌన్‌తో ఆ మీటర్లు బిగించుకునేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉన్నా... డిమాండ్ కు తగ్గ సప్లై చేసే స్థితిలో డిస్కమ్స్ లేవు. దీంతో నార్త్‌ పవర్‌ కంపెనీలు అమలు చేసిన పద్ధతినే అవలంబించాలని తెలంగాణ డిస్కంలు భావిస్తున్నాయ్‌.  మీటరు రీడింగ్‌ను నెలకోసారి ఫోన్‌తో ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే.. ఆన్‌లైన్‌ ద్వారా డిస్కంకు చేరి ఎంత బిల్లు వచ్చిందో తెలిసిపోతుంది. ఆన్‌లైన్‌లోనే సొమ్ము కూడా చెల్లించవచ్చు.

 

నిబంధనల ప్రకారం ప్రతి 30 రోజులకు ఒకసారి రీడింగ్‌ తీసి బిల్లు ఇవ్వాలి. రీడింగ్‌ తీసేవారు ఆలస్యంగా వస్తే శ్లాబు మారి బిల్లు పెరిగిపోతుంది. వినియోగదారుడు సరిగ్గా 30 రోజులకు తానే రీడింగ్‌ ఫొటోతీసి ఆన్‌లైన్‌ ద్వారా పంపితే ఈ భారం తప్పుతుంది. మీటరు రీడింగ్‌ ఫొటోతో బిల్లు వచ్చేలా తాము సొంతంగా యాప్‌ తయారుచేస్తున్నామని.. త్వరలో అందుబాటులోకి తెస్తామని డిస్కమ్స్ స్పష్టం చేస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: