దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరగడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. కరోనా విజృంభించడంతో హైదరాబాద్ నగరంలోని చాలామంది సొంతూళ్లకు వెళ్లారు. గత రెండు నెలల నుంచి ఇంట్లో లేని వారికి కరెంట్ బిల్లు భారీగా కట్టాలని మొబైల్ ఫోన్లను మెసేజ్ లు వస్తున్నాయి. 
 
ఇంట్లో ఎవరూ లేకపోయినా వేల రూపాయల కరెంట్ బిల్లు రావడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. కొందరు సోషల్ మీడియాలో కరెంట్ బిల్లును పోస్ట్ చేసి ఇంట్లో లేకపోయినా ఇంత బిల్లు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దీంతో నగర విద్యుత్ శాఖ అధికారులు ఈ విషయంపై స్పందించారు. 
 
అధికారులు కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల రీడింగ్ తీసుకోవడం కుదరలేదని... అందువల్ల మార్చి, ఏప్రిల్ నెల బిల్లులను గతేడాది లెక్కల ఆధారంగా లెక్కించామని పేర్కొన్నారు. అయితే నగరవాసులు సంవత్సరం క్రితం తాము మరో ఇంట్లో అద్దెకు ఉన్నామని విద్యుత్ శాఖకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ బిల్లులను తాము సర్దుబాటు చేస్తామని మాటిచ్చారు. 
 
గత ఏడాదితో పోలిస్తే తక్కువ విద్యుత్ వాడారని తేలితే కట్టిన మొత్తాన్ని వెనక్కు ఇచ్చేస్తామని చెప్పారు. జూన్ నెలలో ఇంటింటికీ వెళ్లి రీడింగ్ తీస్తామని... స్లాబ్ మారకుండా బిల్లు ఏ నెలకు ఆ నెల ఉండేలా చూస్తామని చెప్పారు. నగరంలో ఎవరి విద్యుత్ కనెక్షన్ ఇప్పటివరకు కట్ చేయలేదని... ప్రజలు అపోహలు నమ్మకుండా బిల్లులు చెల్లించాలని సూచించారు. ప్రజలు సకాలంలో బిల్లులు చెల్లించి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పారు.           

మరింత సమాచారం తెలుసుకోండి: