గత కొన్ని రోజుల నుంచి ఏపీలో కరెంట్ బిల్లుల వివాదం గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. కేంద్రం దేశవ్యాప్తంగా కరోనా విజృంభించడంతో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అమలులో ఉండటంతో ఏపీలో ఏప్రిల్ నెలలో మార్చి నెల వినియోగానికి సంబంధించిన రీడింగ్ తీసుకోలేదు. విద్యుత్ శాఖ మార్చి నెలలో ఎంత మొత్తం కరెంట్ బిల్లు వచ్చిందో ఏప్రిల్ నెలలో అంతే మొత్తం చెల్లించాలని సూచించింది. 
 
కరోనా కేసులు విజృంభిస్తున్నప్పటికీ విద్యుత్ శాఖ ఈ నెలలో వినియోగదారులకు రెండు నెలల రీడింగ్ తో కరెంట్ బిల్లు ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ మొత్తంలో కరెంట్ బిల్లు రావడంతో గృహ వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. కరెంట్ బిల్లుల గురించి ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. తిరుపతి పరిధిలోని కొన్ని గ్రామాల్లో గుడిసెలకు వేలకు వేలు కరెంట్ బిల్లు రావడంతో ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. 
 
ఏపీలో కరెంట్ బిల్లులు అధికంగా రావడానికి అసలు కారణం ఏమిటి...? అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా వేసవికాలంలో విద్యుత్ వినియోగం ఎక్కువాగా ఉంటుంది. శీతాకాలం, వర్షాకాలంతో పోలిస్తే వేసవిలో ఫ్యాన్, ఏసీ వినియోగం పెరుగుతోంది. రెండు నెలల రీడింగ్ ఇవ్వడం వల్ల ఏ కేటగిరీ, బీ కేటగిరీ, సీ కేటగిరీలు మారిపోతున్నాయి. రెండు నెలల రీడింగ్ వల్ల ఏ కేటగిరీకి చెందిన వినియోగదారులకు బీ కేటగిరీ... బీ కేటగిరీకు చెందిన వారికి సీ కేటగిరీ బిల్లులు వస్తున్నాయి. 
 
ప్రభుత్వం ఏ నెల వినియోగానికి సంబంధించిన బిల్లులు వేరువేరుగా ఇచ్చేలా చేయడం లేదా ఈ సమస్యకు మరో విధంగా పరిష్కారం చూపించాల్సి ఉంది. లేదంటే మాత్రం ప్రజా సంక్షేమ పాలనతో ప్రజల్లో మంచిపేరు తెచ్చుకున్న జగన్ సర్కార్ ప్రజాగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో కొంత విద్యుత్ వినియోగం పెరిగినా ప్రభుత్వమే కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: