కరోనా లాక్‌డౌన్‌తో ఆగిపోయిన విమానాలు మళ్లీ ఎగరబోతున్నాయి. మరో ఐదు రోజుల్లో లోకల్‌ ఫ్లైట్స్‌ తిరగబోతున్నాయి. ఈ మేరకు అన్ని ఎయిర్‌ పోర్టులు, విమానయాన సంస్థలకు కేంద్రం సమాచారం అందించింది. పనిలో పనిగా ప్రయాణికులకు సంబంధించి నిర్ధిష్టమైన సూచనలు కూడా చేసింది. 

 

కరోనా లాక్‌డౌన్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. మార్చి 25 నుంచి పాసింజర్‌ ఫ్లైట్లు తిరగడం లేదు. కార్గో విమానాలు, వైద్య అవసరాలతో పాటు విదేశాల్లో చిక్కుకుపోయిన మన విద్యార్థుల్ని తీసుకొచ్చే ప్రత్యేక విమానాలు మాత్రమే తిరుగుతున్నాయి. కాగా లాక్‌డౌన్‌ ఆంక్షల్ని అంచెలంచెలుగా సడలిస్తున్న కేంద్రం... దేశీయ విమాన సర్వీసులకు అనుమతిచ్చింది. ఈ నెల 25 నుంచి విమానాలు తిప్పుకోవచ్చంటూ ఎయిర్‌లైన్స్‌ అన్నింటికీ సమాచారమిచ్చింది. అలాగే ఎయిర్‌ పోర్టులకు కూడా ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ మేరకు కేంద్ర విమానాయన మంత్రి హర్దీప్‌ పురి ట్వీట్‌ చేశారు.

 

కరోనా వల్ల మన జీవితాల్లో మార్పు వచ్చింది. ఈ క్రమంలో విమాన ప్రయాణీకులకు సంబంధించి స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రోటోకాల్స్‌ - ఎస్ ఓ పీ జారీ చేసింది కేంద్రం. దీని ప్రకారం సీటింగ్‌ కెపాసిటీకి దాదాపు సగం మందితోనే విమానాలు తిరగబోతున్నాయి. ప్రయాణీకులు పక్కపక్కన కూర్చోకుండా వ్యక్తిగత దూరం పాటించేలా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే విమానాల్లో ప్రయాణించే వాళ్లకు మాస్క్‌ తప్పనిసరి. 

 

నాల్గో విడత లాక్‌డౌన్‌ ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో జూన్‌ ఒకటి నుంచి బుకింగ్స్‌ తెరిచాయి పలు విమానయాన సంస్థలు. అయితే... వారం రోజులు ముందుగానే దేశీయ సర్వీసులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇది విమానయాన సంస్థలకు ఊరటనిచ్చే అంశమే. 

 

లాక్‌డౌన్‌ వల్ల దేశీయ విమానయాన రంగం తీవ్రంగా నష్టపోయింది. ఇండిగో, స్పైస్‌ జెట్‌, గో ఎయిర్‌ తదితర సంస్థలు... లాక్‌డౌన్‌ కాలానికి ఉద్యోగులకు జీతాలు చెల్లించలేమని చెప్పేశాయి. దాదాపు 30 శాతం ఉద్యోగాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా గల ఎయిర్‌ పోర్టుల్లో సుమారు 650 విమానాలు నిలిచిపోయాయి. కేంద్రం అనుమతిచ్చినా... ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ కారణాల వల్ల చాలా వరకు విమానాలు ఇప్పట్లో రెక్కలు విదిలించే అవకాశం లేదంటున్నారు ఈ రంగానికి చెందిన నిపుణులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: