నల్లజాతి సూరీడు, సౌతాఫ్రికా మాజీ ప్రెసిడెంట్ నెల్సన్‌ మండేలా కుమార్తె జిండ్జీ (59) కన్నుమూశారు. జోహన్నెస్‌బర్గ్‌ ఆస్పత్రిలో సోమవారం (జులై 13) ఆమె ప్రాణాలు విడిచిన‌ట్లు విడిచినట్లు స్థానిక మీడియా తెలిపింది.   అయితే ఆమె మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.   ప్రస్తుతం జిండ్జీ డెన్మార్క్‌ రాయబారిగా పనిచేస్తున్నారు. కాగా నెల్సన్‌ మండేలా- రెండో భార్య విన్నీ మడికిజెలాకు పుట్టిన సంతానం జిండ్జీ. 

 

 

జైలు నుంచి నెల్సన్ మండేలా పంపిన సందేశాన్ని… భారీ జనసమూహంలో ‘నిప్పుల గొంతుక’ తో చదివి వినిపించి ఆమె సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. దాంతో 1985లో జిండ్జీ మండేలాకు ఒక్కసారిగా ఊహించ‌ని ప్రాచుర్యం లభించింది. మండేలా ఉద్యమాన్ని వదిలేస్తే.. ఆయణ్ని చెర‌సాల‌ నుంచి రిలీజ్ చేస్తామని నాటి దక్షిణాఫ్రికా పాలకులు చెప్ప‌గా.. అందుకు ఆయన స‌సేమేరా అన్నారు.

 

ఆ ప్రకటనను జిండ్జీ మండేలా..భారీ బహిరంగ సభలో..ఇసుక వేస్తే రాలని జ‌న‌సంద్రంలో చదివి వినిపించారు.  1994లో మండేలా దక్షిణాఫ్రికాకు అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత విన్నీ ఆయన మంత్రివర్గంలో చేరారు. అయితే.. 1995లో అవినీతి ఆరోపణలపై నెల్సన్ మండేలా ఆమెను కేబినెట్ నుంచి తొలగించారు. అప్పట్లో ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది. 2018 ఏప్రిల్‌లో విన్నీ మండేలా (81) అనారోగ్యంతో కన్నుమూశారు. నెల్సన్‌ మండేలాకు మొత్తం ముగ్గురు భార్యలు ఆరుగురు సంతానం. 20 మంది మనువలు, మనవరాళ్లు ఉన్నారు. కాగా మండేలా తీవ్ర శ్వాసకోశ సంబంధ అస్వస్థతతో బాధపడుతూ 2013 డిసెంబర్ 5 న జోహన్నెస్‌బర్గ్‌లో‌ మరణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: