కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఆత్మ నిర్భర్ ప్యాకేజీలో సైతం కేంద్రం రైతుల కోసం పెద్దఎత్తున నిధులను కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా దేశంలోని పేద రైతులకు అండగా నిలుస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మోదీ దేశంలోని 8.5 కోట్ల మంది రైతుల బ్యాంక్ ఖాతాలలో 17,100 కోట్ల రూపాయల నగదును జమ చేశారు.
 
ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఆన్ లైన్ లో నగదును బదిలీ చేశారు. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రధాని జమ చేసిన నగదు వల్ల ప్రయోజనం చేకూరనుంది. ప్రతి సంవత్సరం కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 6 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తోంది. సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా రైతుల ఖాతాలలో జమవుతోంది.
 
కేంద్ర ప్రభుత్వం 2018 సంవత్సరం డిసెంబర్ 1 నుంచి రైతుల సంక్షేమం కోసం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్రం ఈ పథకం కోసం 75 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. రైతులు ఈ నగదు ఖాతాలలో జమ అయిందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. pmkisan.gov.in వెబ్ సైట్ ద్వారా పీఎం కిసాన్ యాప్ ద్వారా నగదు ఖాతాలలో జమైందో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
 
యాప్ ద్వారా గతంలో జమ అయిన నగదు వివరాలను కూడా తెలుసుకోవచ్చు. లబ్ధిదారులైనా ఖాతాలలో నగదు జమ కాకపోతే జిల్లా వ్యవసాయాధికారిని సంప్రదించాల్సి ఉంటుంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ యొక్క హెల్ప్‌లైన్ నంబర్ కు కాల్ చేసి ఎందుకు నగదు జమ కాలేదో తెలుసుకోవచ్చు లేదా 155261 లేదా 1800115526 నంబర్లకు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. కేంద్రం కరోనా కష్ట కాలంలో నగదు జమ చేస్తుండటంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: