హిందీలో మాట్లాడకపోతే భారతీయులు కాదన్నట్టుగా చూస్తున్నారని డీఎంకే ఎంపీ కనిమొళి ఆరోపించారు. ఎయిర్ పోర్ట్ లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని హిందీ ఇంపోజిషన్ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో వెల్లడించారు. కనిమొళి ప్రకటనతో  సీఐఎస్ఎఫ్ క్షమాపణలు చెప్పగా.. పలవురు ప్రముఖులు.. కనిమొళికి నైతిక మద్దతు తెలిపారు.  

డీఎంకే పార్టీ కీలక నేత, ఎంపీ కనిమొళికి చేదు అనుభవం ఎదురైంది. హిందీలో మాట్లాడనందుకు సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన ఓ  మహిళా అధికారి మీరు భారతీయులేనా?  అని ప్రశ్నించారని మహిళా ఎంపీ కనిమొళి తెలిపారు. జరిగిన  ఘటనపై సీఐఎస్ఎఫ్ విచారణకు ఆదేశించింది. సీఐఎస్ఎఫ్ స్పందించినందుకు కనిమొళి ధన్యవాదాలు తెలిపారు.  

భారతీయులకు ఖచ్చితంగా హిందీలో మాట్లాడటం రావాలని ఎప్పటి నుంచి నిబంధన పెట్టారో  తెలుసుకోవాలని ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు కనిమొళి. ఆధునిక సాంకేతిక యుగంలో కమ్యూనికేషన్ కోసం ఎన్నో టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయని, అయినా సరే ఎవరిపై అయినా ఓ భాషను ఎందుకు రుద్దాలని ప్రశ్నించారు కనిమొళి.

హిందీ భారతీయ భాషల్లో ఒకటి మాత్రమే అని చెబుతున్న కేంద్రం.. ఎందుకు హిందీ ప్రచార సభ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని కనిమొళి ప్రశ్నించారు. రాజ్యాంగం గుర్తించిన ఇతర భాషల ప్రచారంపై ఎందుకు ఖర్చు చేయడం లేదని ఆమె నిలదీశారు.

కనిమొళికి జరిగిన చేదు అనుభవంపై పలువురు ప్రముఖులు స్పందించారు. కనిమొళికి జరిగింది అసాధారణమేమీ కాదన్నారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. తనకూ ఇలాంటి అనుభవాలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడూ అధికారులతో పాటు సామాన్య ప్రజలు కూడా హిందీ మాట్లాడాలని అడిగినట్టు తెలిపారు. చిదంబరం కుమారుడు. కార్తీ చిదంబరం సైతం కనిమొళి ఘటనపై స్పందించారు. కనిమొళి ప్రకటనకు స్పందిస్తూ..  భాషాభిమానానికి పరీక్ష పెడుతున్నారు. సీఐఎస్ఎఫ్ దీనికి ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా కనిమొళికి నైతిక మద్దతుగా సోషల్ మీడియాలో స్పందించారు. హిందీ పాలిటిక్స్ కారణంగానే చాలా మంది దక్షిణాది నేతలు ప్రధాని కాలేకపోయారని ఆయన గుర్తుచేశారు. తన తండ్రి దేవెగౌడ సీఎంగా ఉన్నప్పుడు కూడా హిందీ లాబీ ఒత్తిడితోనే రైతుల్ని ఉద్దేశించి హిందీలో మాట్లాడారని చెప్పారు కుమారస్వామి. ఢిల్లీలో హిందీయేతర ఎంపీలకు విలువ లేదని, అధికార పక్షం దృష్టిలో వారు అసలు మనుషులే కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. హిందీ ప్రచార సభకు కోట్లు వెచ్చిస్తున్న కేంద్రం.. కన్నడ భాషను ఎందుకు ప్రచారం చేయడం లేదని ఆయన నిలదీశారు. అయితే కనిమొళి హిందీ ఇంపోజిషన్ ఎపిసోడ్ ను ఎన్నికల స్టంట్ గా అభివర్ణించింది తమిళనాడు బీజేపీ. రాష్ట్రంలో ఇంకా 8 నెలల్లో ఎన్నికలు ఉన్నాయని, అప్పుడే ప్రచారం మొదలుపెట్టేశారని సెటైర్లు వేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: