జగన్ అధికారంలోకి రాగానే ఒక్కసారిగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే అవకాశం దక్కని వారికి రెండున్నర ఏళ్ల తర్వాత జరిగే విస్తరణలో చోటు కల్పిస్తానని చెప్పారు. అప్పుడే పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టేస్తానని చెప్పారు. అయితే హఠాత్తుగా మండలి రద్దు నిర్ణయంతో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు మంత్రి పదవులు కోల్పోవడంతో వారి స్థానాల్లో సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్‌లకు అవకాశం కల్పించారు.

ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చి 16 నెలలు కావొస్తుంది. అంటే మరో 14 నెలల్లో జగన్ మరోసారి మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. అయితే ఈ విస్తరణలో కొందరిని రీప్లేస్ చేయడం ఖాయమని పలువురు రాజకీయ విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు. ఈ 16 నెలల కాలంలో కొందరు మంత్రులుగా పూర్తిగా నిలదొక్కుకోలేదని, అలాగే శాఖలపై పట్టు తెచ్చుకున్నట్లు కనిపించడం లేదని చెబుతున్నారు.

ఇంకా కొందరు రాష్ట్ర స్థాయిలో ఫేమస్ కాలేదని అంటున్నారు. ఇలాంటి వారిని జగన్ పక్కనబెట్టేసి కొత్తవారికి అవకాశం ఇస్తారని, అయితే కొన్ని జిల్లాలో రీప్లేస్ ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే మరికొన్ని జిల్లాలకు అదనంగా మరో పదవి దక్కే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, తెల్లం బాలరాజు, కొలగట్ల వీరభద్రస్వామి, గుడివాడ అమర్నాథ్, పిన్నెల్లి రామకృష్ణ, ముస్తఫా, అనంత వెంకట్రామిరెడ్డిలకు మెరుగైన అవకాశాలున్నాయని అంటున్నారు.

ఇక విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఒక్కో మంత్రి పదవే ఉంది. విశాఖలో అవంతి శ్రీనివాస్, గుంటూరులో సుచరిత, అనంతలో శంకర్ నారాయణలు మాత్రమే జగన్ కేబినెట్‌లో ఉన్నారు. ఈ జిల్లాలకు మరో మంత్రి పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది. ఈ జిల్లాల్లో కూడా పదవి దక్కించుకునేందుకు చాలామంది ఎమ్మెల్యేలు పోటీ పడుతూనే ఉన్నారు. మరి చూడాలి నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో జగన్ ఎవరిని రీప్లేస్ చేస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి: