తెలుగు సాహిత్యంలో తొలిజ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.- కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్షపుటలుండవచ్చును.


విశ్వనాథ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించారు. జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పారు - "ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాథ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా అతను చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాథ కృతిలో అతనుదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్షణ్యం వెల్లివిరుస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం - ఈ వ్యక్తిత్వం."


శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు1895, సెప్టెంబరు 10న (మన్మథ నామ సంవత్సర భాద్రపద బహుళ షష్ఠి) కృష్ణా జిల్లా నందమూరు గ్రామం (నేటి ఉంగుటూరు మండలం)లో జన్మించాడు. తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతమ్మ. ఈయన భార్య వరలక్ష్మమ్మ. విద్యాభ్యాసము నందమూరు, ఇందుపల్లి, మరియు పెదపాడు గ్రామాల్లోను, పై చదువులు బందరు పట్టణంలోను సాగాయి. బందరు హైస్కూలులో చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తెలుగు ఉపాధ్యాయునిగా లభించడం ఆయన అదృష్టం. బి.ఎ. తరువాత విశ్వనాథ బందరు హైస్కూలులోనే ఉపాధ్యాయునిగా చేరారు. ఉద్యోగం చేస్తూనే మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఎ. పట్టా సాధించారు. తరువాత మహాత్మా గాంధీ నడపుతున్న సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం కోసం ఉద్యోగాన్ని వదులుకున్నాడు.


తరువాతి కాలంలో ఈయన వివిధ కళాశాలల్లో అధ్యాపక పదవులు నిర్వహించాడు. బందరు నేషనల్ కాలేజి (1928), గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజి (ఏసీ కాలేజీ) (1938 వరకు), విజయవాడలో ఎస్.ఆర్.ఆర్.&‍ సి.వి.ఆర్. కాలేజి (1938-1959)(ఈ కళాశాల ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాల గా మార్పు చెందింది), కరీంనగర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కాలేజి (1959) మొదలైన కళాశాలల్లో ఆయన పని చేసాడు. 1957లో విశ్వనాథ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షుడుగానూ, 1958లో విధానమండలికి నామినేటెడ్ సభ్యుడుగానూ విధులు నిర్వర్తించారు.1976 అక్టోబరు 18న (నల నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ దశమి) శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు పరమపదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: