అధికార పార్టీలో మంత్రుల విష‌యం మ‌రోసారి ర‌చ్చ‌గా మారింది. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. దాదాపు ఐదుగురు మంత్రుల వ‌ర‌కు.. టార్గెట్ అవుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన వ్య‌వ‌సాయ మంత్రి క‌న్న‌బాబు టార్గెట్‌గా ఎమ్మెల్యేలు, ఎంపీల మ‌ధ్య వివాదం న‌డిచింది. ఇది రోడ్డున కూడా ప‌డింది. ఇక‌, విశాఖ‌కు చెందిన ప‌ర్యాట‌క మంత్రి అవంతి శ్రీనివాస్ విష‌యం కూడా వివాదాల సుడిలో తిరుగుతూనే ఉంది. గ‌తంలో విజ‌య‌సాయి రెడ్డి ఆయ‌న దూకుడుకు బ్రేకులు వేశార‌నే క‌థ‌నాలు వ‌చ్చాయి. కొన్నాళ్లు ఇద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ బేధాలు కూడా కొన‌సాగాయి. ఆ మాట‌కు వ‌స్తే వైజాగ్‌లో విజ‌య‌సాయి ఆధిప‌త్య రాజ‌కీయాల‌తో మంత్రి అవంతి బాగా విసిగి పోయారనే వైసీపీ వాళ్లు చెపుతున్నారు.

ఇక‌, విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన ఇద్ద‌రు కీల‌క మంత్రులు కూడా ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్య ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించుకుంటున్నారు. మంత్రి బొత్స వ్య‌వ‌హారంతో.. మ‌రో మంత్రి పుష్ప శ్రీవాణి తీవ్ర కినుక వ‌హించిన విష‌యం తెలిసిందే. ఏకంగా జిల్లా ప‌ర్య‌ట‌న‌ల‌ను కూడా ఆమె ర‌ద్దు చేసుకున్నారు. ఇక‌, అప్ప‌టి నుంచి మంత్రి బొత్స‌కు దూరంగా పుష్ప శ్రీవాణి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రోవైపు.. అనంత‌పురం జిల్లాకు చెందిన శంక‌ర నారాయ‌ణ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు మంత్రుల ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింది. ఆధిప‌త్య రాజ‌కీయాల్లో వారు నలిగిపోతున్నార‌ని ప్ర‌త్య‌క్షంగా జ‌రుగుతున్న ప‌రిణామాలు రుజువు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా మంత్రి అవంతికి ఘోర ప‌రాభ‌వం జ‌ర‌గ‌డం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. విశాఖ జిల్లా సింహాచ‌లం దేవస్థానానికి చెందిన ఫ్ల‌వ‌ర్ గార్డెన్‌ను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించిన పాలక మండలి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మంత్రి అవంతిని ఆహ్వానించింది. కార్యక్రమం ఉదయం 9.15 గంటలకు ప్రారంభమవుతుందని మంత్రికి సమాచారం ఇచ్చింది. అయితే మంత్రి ఉదయం 10.10 గంటలకు చేరుకున్నారు. అప్పటికే విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌, విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ కన్వీనర్‌ కేకే రాజు మొక్కలు నాటి వెళ్లిపోయారు. దీంతో మంత్రి తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు.

ఇలా ఈ ఒక్క ఘ‌ట‌నే కాదు.. రాష్ట్రంలో చాలా మంది మంత్రుల‌కు ఇలానే ప‌రాభ‌వాలు ఎదుర‌వుతున్నాయ‌ని అంటున్నారు. నెల్లూరు లాంటి చోట్ల మంత్రుల‌ను ప‌ట్టించుకోని ప‌రిస్థితులే ఉన్నాయి. క‌న్న‌బాబు లాంటి స్ట్రాంగ్ మంత్రులే ఎమ్మెల్యేల‌తో పాటు వైసీపీ కీల‌క నేత‌ల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందంటేనే మంత్రుల‌ను కొంద‌రు ఎలా ?  ప‌ట్టించుకోవ‌డం లేదో ? అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఇది వైసీపీలో తీవ్ర చ‌ర్చ‌గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: