సంక్రాంతి పండుగ కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. ఈ సంక్రాంతి సీజన్ లో వివిధ నగరాల నుంచి తమ స్వస్థలాలకు వెళ్లే వారి కోసం మొత్తం 1,500 ప్రత్యేక సర్వీసులను నడిపించాలని  నిర్ణయించింది. గత సంవత్సరం 2 వేల 200 బస్సులు తిప్పిన అధికారులు
ఈ సంవత్సరం తగ్గించారు. కరోనా ప్రభావంతో గతంలో మాదిరి డిమాండ్ ఉండదన్న భావనలో సర్వీసుల సంఖ్యను తగ్గించామని  ఏపీఎస్ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు . బుధవారం అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించిన ఎండీ కృష్ణబాబు, అత్యధిక సర్వీసులను హైదరాబాద్ కు నడిపించేలా ప్రణాళికలు రూపొందించారు.

        ప్రతి సంవత్సరం మాదిరిగానే  ఈ సంవత్సరం కూడా ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లే సర్వీసుల రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయిపోయాయి. ఆ తరువాత విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు రూట్లలో డిమాండ్ అధికంగా కనిపిస్తోంది. ఎంజీబీఎస్ లో బస్సుల రద్దీని తగ్గించేందుకు వివిధ ప్రాంతాల నుంచి బస్సులను కదిలించేలా షెడ్యూల్  తయారైంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, మాచర్ల, ఒంగోలు, తిరుపతి బస్సులు గౌలిగూడ సిటీ బస్ టర్మినల్ నుంచి  ఏపీఎస్ఆర్టీసీ బస్సులు బయలుదేరుతాయి.

      విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, విజయనగరం, శ్రీకాకుళం అన్ని స్పెషల్ బస్సులు, బయలుదేరిన ప్రాంతం నుంచే నేరుగా వెళ్లిపోతాయి. విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరు నగరాలకూ ప్రత్యేక సర్వీసులను నడిపించాలని అధికారులు నిర్ణయించారు. ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరిగితే అందుకు అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేస్తామని ఏపీ అధికారులు చెబుతున్నారు. అయితే సంక్రాంతి నాటికి తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలతో ఈ  సంక్రాంతి పండుగ  సీజన్ లో ప్రయాణాలు అంతగా ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: