కరోనా సీజన్లో ముందస్తు సమాచారం లేకుండానే ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. గిట్టుబాటు కావడం లేదని, చార్జీలు పెంచి బస్సు సర్వీసుల్ని నడిపారు. ఇప్పుడు ప్రయాణికుల రద్దీ పెరిగినా కూడా కొన్ని చోట్ల పాత చార్జీలే అమలులో ఉన్నాయి. ఇక పండగ సీజన్ ని ఆర్టీసీ ఎందుకు వదులుకుంటుంది చెప్పండి. అందులోనూ రైలు సర్వీసులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ప్రత్యేక బస్సుల పేరుతో ప్రత్యేక చార్జీల మోత మోగించబోతోంది.

సాధారణ రోజుల్లో అయినా, పండగ రోజుల్లో అయినా.. ఆర్టీసీ ఒకే చార్జీలు వసూలు చేయాలి. కానీ తెలివిగా పండగ రోజుల్లో ప్రత్యేక సర్వీసుల పేరుదో ఆర్టీసీ అధిక ఆదాయ మార్గాలను అణ్వేషించింది. పండగ రోజుల్లో కూడా ఆర్టీసీ బస్సులే తిరుగుతాయి, వాటిల్లో కూడా ఆర్టీసీ సిబ్బందే డ్రైవర్లు, కండక్టర్లుగా ఉంటారు. కానీ చార్జీలు మాత్రం రెట్టింపు అవుతాయి. అదేమంటే.. స్పెషల్ బస్ అనే స్టిక్కర్ ఒకటి చూపిస్తారు. చేసేదేం లేక ప్రయాణికులు కూడా మౌనంగా వెళ్లిపోతుంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పండగ సర్వీసుల బుకింగ్ మొదలు కాబోతోంది. సెలవు రోజుల్లో సాధారణ సర్వీసులు ఇప్పటికే నిండిపోయాయని చెబుతున్న అధికారులు, ప్రత్యేక బస్సుల్లో మాత్రమే ఖాళీలు చూపిస్తున్నారు. అటు రైలు సర్వీసులు పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులే గత్యంతరం అయ్యాయి.

సంక్రాంతి పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడపబోతున్నట్టు ఏపీఎస్‌ ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 8 నుంచి 13 వరకు 3,607 ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపారు. ఈ మేరకు ఈడీ ఓ ప్రకటన విడుదల చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చే వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మొత్తం ప్రత్యేక బస్సు సర్వీసుల్లో హైదరాబాద్‌ సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి 1,251 బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల మధ్య 1,038 ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈడీ వివరించారు. అయితే ఈ ప్రత్యేక సర్వీసుల్లో ఛార్జీలకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం అధికారులు వెళ్లడించలేదు. అటు తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సుల లిస్ట్ రెడీ చేసింది. కేవలం ఏపీకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఈ ప్రత్యేక సర్వీసులు, ప్రత్యేక వడ్డన రెడీ చేశారు అధికారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: