తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజులుగా టీపీసీసీ చీఫ్ పదవిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే సాగర్ ఎన్నిక వరకు టీపీసీసీ చీఫ్ నిర్ణయాన్ని అధిష్టానం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తిన బాట పట్టారు. ఇవాళ ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇప్పడు టీకాంగ్రెస్ నేతల్లో ఆసక్తికరంగా మారింది. ఆయన అధిష్టానంతో రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికల రానున్నాయి. దీంతో ఆ ఎన్నికల కోసం అభ్యర్ధుల ఎంపిక మొదలుపెట్టింది తెలంగాణ కాంగ్రెస్‌. ముఖ్య నాయకులు... డీసీసీ అధ్యక్షులతో సమావేశమై చర్చించారు ఉత్తమ్‌. నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వొద్దని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. మరోవైపు తమకు మద్దతు ఇవ్వాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌లు విడివిడిగా కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేశారు.
 
 

 అయితే దీనిపై నిర్ణయం తీసుకునేందుకుగాను ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కమిటీ వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు... ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల కమిటీలపై కూడా చర్చ జరిగింది. వీటికి సంబంధించి ఎన్నికలు, మేనిఫెస్టో కమిటీల్ని వేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే... రంగారెడ్డి.. హైదరాబాద్.. పాలమూరు నియోజకవర్గం నుండి ... మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి , వంశీ పేర్లతో పాటు... ఉపాధ్యాయ సంఘం నుండి హర్ష వర్ధన్ పేరు కూడా హైకమాండ్‌కు పంపుతున్నారు. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుండి... మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, బెల్లయా నాయక్ పేర్లు చర్చకు వచ్చాయి. అటు మానవతా రాయ్ పేరు కూడా పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో ఇవాళ ఉత్తమ్‌ ఢిల్లీ వెళ్తుండడంతో హైకమాండ్‌తో ఏం చర్చిస్తారన్నది హాట్‌ టాపిక్‌గా మారింది. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తే.. ఇక కార్పొరేషన్ ఎన్నికలపై నజర్ పెట్టాలని చూస్తోంది టీ కాంగ్రెస్‌. మొత్తానికి కాంగ్రెస్ హైకమాండ్ మరి ఎవరి పేర్లను ఖరారు చూస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: