ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే ఇప్పుడు గిరిజ‌నుల‌కు టార్గెట్ అయ్యారా?  స‌ద‌రు మంత్రి, ఎమ్మెల్యే కూడా గిరిజ‌న నాయ‌కులే అయిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు అదే వ‌ర్గం నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోందా? అంటే.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ్ర‌హిస్తే... ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. విజ‌య‌నగ‌రం జిల్లాలోని కురుపాం, సాలూరు నియోజ‌క‌వ‌ర్గాలు ఎస్టీ వ‌ర్గాల‌కు రిజ‌ర్వ్ అయ్యాయి. కురుపాం నుంచి గెలిచిన పుష్ప శ్రీవాణి డిప్యూటీసీఎం అయ్యారు. ఇక‌, సాలూరు నుంచి విజ‌యం సాధించిన పీడిక రాజ‌న్న‌దొర ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే.. వీరికి నీరాజ‌నాలు ప‌ట్టి.. గెలిపించిన గిరిజ‌నులు ఇప్పుడు త‌ల ప‌ట్టుకుంటున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. మూడు స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని స్థానిక గిరిజ‌నులు స‌భ‌లు పెట్టిమ‌రీ వీరిని విమ‌ర్శిస్తున్నారు.

శిఖపరువులో మైనింగ్‌, కుడుమురు భూములు, షెడ్యూల్‌ సర్టిఫికెట్ల సమస్య‌లు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కొన్ని ద‌శాబ్దాలుగా మూలుగుతున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో వీటిని ప‌రిష్క‌రిస్తామ‌ని, అయితే.. వైసీపీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చేలా కృషి చేయాల‌ని గిరిజ‌నుల‌కు చెప్పారు. దీంతో వారు రెచ్చిపోయి మ‌రీ .. వైసీపీ నేత‌ల‌ను గెలిపించారు. క‌ట్ చేస్తే.. వైసీపీ స‌ర్కారు ఏర్ప‌డి ఏడాదిన్న‌ర అయినా.. ఈ మూడు స‌మ‌స్య‌లు అలానే ఉన్నాయి. పైగా.. ఆ సమస్యలను స్థానిక ప్రజాప్రతిని ధులు పట్టించుకోకపోవడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.

సమస్యల పరిష్కారం కోసం డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరలకు చెప్పి ఉపశమనం పొందడం కోసం ప్ర‌య‌త్నిస్తుంటే.. వారు క‌నీసం కంటికి కూడా క‌నిపించకుండా దోబూచులాడుతున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు గిరిజనులు ప్రస్తావించిన ఈ సమస్యలకు సంఘీభావం తెలిపిన ప్రజాప్రతినిధులు.. పవర్‌లోకి రాగానే ముఖం చాటేయ‌డం గిరిజనులను ఆశ్చర్య పరుస్తోంది. పైగా ఎవరైనా గట్టిగా నిలదీస్తే అంతా అధికారులే చేస్తున్నారు.. మా చేతుల్లో ఏం లేదని చెప్పడం గిరిజనులను నివ్వెర పరుస్తోంది.

దీంతో ఇప్పుడు మంత్రి, ఎమ్మెల్యేల‌పై గిరిజ‌నులు నిప్పులు చెరుగుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులే పట్టించుకోకపోతే ఇంకెక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. మ‌రికొంద‌రైతే.. మ‌ళ్లీ ఎన్నిక‌లు రాపోతాయా..? అప్పుడు మాద‌గ్గ‌ర‌కు రాక‌పోతారా? అంటూ.. వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా మంత్రి, ఎమ్మెల్యేల‌కు గిరిజ‌నుల నుంచి సెగ భారీగానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: