టీడీపీ కార్యకర్తల మనోభీష్టానికి అనుగుణంగా కోడిపందాల కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు పోలీసులకు వ్యతిరేకంగా తమ గళం విప్పినా ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాత్రం మరింత దూకుడుగా వ్యవహరించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామ్‌రెడ్డిని నేరుగా టార్గెట్ చేసి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఉంగుటూరు వచ్చిన సందర్భంలో కూడా జిల్లా ఎస్పీకి, ఎంపీ బాబుకు మధ్య మాటల అంతరం చోటు చేసుకుందన్న వాదనలు వినిపించాయి. సభావేదికపైకి ఎంపీతో ఉన్న వారిని అనుమతించే విషయంలో ఎస్పీ అభ్యంతరం చెప్పడంతో బాబు అలిగి కిందనే ఉండిపోవడం, ఆ తర్వాత ఎమ్మెల్యేలు బతిమాలడంతో వేదికపైకి వెళ్లడం ఆ రోజు చోటుచేసుకున్నాయి. బహుశా అది దృష్టిలో పెట్టుకునే మాగంటి బాబు ఇప్పుడు కోడిపందాల విషయంలో ఎస్పీని టార్గెట్ చేశారని అంటున్నారు. లేదంటే మండల స్థాయి టీడీపీ నేతలు, కార్యకర్తలు నేరుగా ఎస్పీకి వ్యతిరేకంగా బహిరంగ నినాదాలిచ్చే సాహసం చేయరన్న వాదనలున్నాయి. మాగంటి బాబు ప్రోద్బంలతోనే పోలీసులైపై టీడీపీ శ్రేణులు ఇలా రెచ్చిపోయారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ వాదనలకు బలం చేకూర్చే విధంగానే మాగంటి తీరు కూడా ఉంది. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఎంపీలు మురళీమోహన్, గోకరాజు గంగరాజు భేటీ అయినా మాగంటి బాబు మాత్రం రాలేదు. అప్పటివరకు అక్కడే ఉన్న ఆయన అధికారులతో భేటీకి ముందే ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత డీఐజీ హరికుమార్‌కు ఫోన్ చేసి జిల్లా పోలీస్ యంత్రాంగం కోడిపందాలపై అతిగా వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మాగంటి బాబు జిల్లా ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామ్‌రెడ్డి లక్ష్యంగానే కోడిపందాల కథ నడిపారన్న వాదనలు రాజకీయవర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: