కరోనా కష్టకాలం తర్వాత ప్రయాణికులకు నెప్పి తెలియకుండానే ఆర్టీసీలో చార్జీలను సర్దుబాటు చేశారు. అయితే ఇప్పుడు మరో 10కోట్ల రూపాయల నష్టాన్ని సర్దుబాటు చేసుకునేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గతంలో తీసుకున్న నిర్ణయమే అయినా.. ఇప్పుడే దీనిపై అడుగు ముందుకు పడింది. ఏటా 10కోట్ల రూపాయల భారంగా పరిణమిస్తున్న టికెటింగ్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళణ చేయబోతోంది.

ప్రతి ఏడాదీ ఏపీఎస్ఆర్టీసీలో 5 వేల కోట్ల రూపాయల విలువైన టికెట్లు అమ్ముడవుతాయి. రోజుకు సగటున 30 లక్షల టికెట్లు అమ్ముడవుతున్నట్లు ఆర్టీసీ అధికారుల సమాచారం. అయితే ఈ టికెట్లను జారీ చేయడం కూడా ఆర్టీసీకి భారంగానే ఉంది. గతంలో కేవలం టికెట్ చించి చేతిలో పెట్టేవారు. ఆ తర్వాత టిమ్ మిషన్లు వచ్చాయి. కేవలం టిమ్ మిషన్లకోసమే ఏటా రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఆర్టీసీ కేటాయించాల్సి వస్తోంది. పేపర్‌ రోల్స్‌కు రూ.2 కోట్ల వరకు ఖర్చవుతోంది. మొత్తంగా సగటున ఏటా 10కోట్ల రూపాయలు ఆర్టీసీ టికెట్ల జారీకోసం కేటాయిస్తోంది.  

యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ ప్రాజెక్టులో భాగంగా ఇకపై ఆర్టీసీ టికెట్ల జారీకోసం ఎలాంటి ఖర్చు పెట్టక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం రూ.30కోట్లు కేటాయిస్తోంది. టికెట్ల జారీ ప్రక్రియను ఇకపై కన్సార్షియంకు టెండర్‌ విధానం ద్వారా అప్పగిస్తారు. బ్యాంకు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కలిపి కన్సార్టియంగా ఏర్పడి టెండర్లలో పాల్గొనాల్సి ఉంటుంది. అన్ని బస్‌ సర్వీసుల్లో టిమ్‌ మిషన్లకు బదులు బ్యాంకు అందించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ–పోస్‌ మిషన్లను వినియోగిస్తారు. వాటి ద్వారానే ఇక టికెట్లు జారీ చేస్తారు. టెండర్లలో పాల్గొనే కన్సార్టియంకు ప్రతి టికెట్ పై కమిషన్ ఇస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏ ఆర్టీసీ బస్సులో ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో.. ప్రధాన కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.

ఈ విధానంకోసం ఆర్టీసీ పంపిన డ్రాఫ్ట్‌ ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. కేంద్రం ఇప్పుడు ఆమోదముద్ర వేయడంతో ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్లు పిలిచి ఎంపికైన కన్సార్టియంకు ప్రాజెక్టు అప్పగిస్తారు. పల్లె వెలుగు బస్సుల నుంచి హై ఎండ్‌ టెక్నాలజీ బస్సుల వరకు ఈ విధానం అమలవుతుంది. ప్రస్తుతం ఆర్టీసీలో 39 శాతం మాత్రమే ఆన్ ‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని అనుసరిస్తున్నారు. కొత్త విధానంతో ఆన్ లైన్ టికెట్ల శాతం ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: