గత తొమ్మిది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం ఇంకా రాజకీయ వర్గాల్లోనూ, కార్మిక వర్గాల్లోనూ కూడా తీవ్రమైన చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజ్యసభ సాక్షిగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం సంచలన నిజాలు బయటపెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో దక్షిణ కొరియా దేశానికి చెందిన పోస్కో (POSCO) ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రధాన్ వెల్లడించారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పోస్కో ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్‌తో 2019 అక్టోబర్‌లోనే ఒప్పందం కుదిరిందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికే 3 సార్లు పోస్కో బృందం సందర్శించిన విషయాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.




పోస్కో, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) మధ్య భూముల అప్పగింతకు ఒప్పందం కుదిరిందన్నారు. పోస్కో ప్లాంట్ ఏర్పాటుకు ఇప్పటికే జాయింట్ వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. కొత్త ప్లాంట్‌లో పోస్కో వాటా కనీసం 50 శాతంగా ఉంటుందన్నారు. అంటే, అంతకు మించి కూడా పోస్కో కంపెనీ వాటా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ, ఆర్‌ఐఎన్‌ఎల్‌ మాత్రం వాటా ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదని కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. కాగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పిన వివరాల ప్రకారం.. పోస్కో కంపెనీ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం తర్వాతే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. 2020 అక్టోబర్ 29న పోస్కో ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్చలు 2018లోనే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. పోస్కో, హ్యుందాయ్ జాయింట్ వెంచర్ ప్రతినిధులు.. 2018 అక్టోబర్ 22న విశాఖపట్నం వచ్చి, ఆర్ఐఎన్ఎల్, ఎన్డీఎంసీ, కేంద్ర స్టీల్ శాఖతో భేటీ అయినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. 2019 జూలై 9న మళ్లీ సందర్శించి చర్చలు జరిపారని పేర్కొన్నారు. ఆ తర్వాత 2019 అక్టోబర్‌లో ఆర్ఐఎన్ఎల్, పోస్కో కంపెనీల మధ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. అనంతరం ప్లాంట్ ఏర్పాటు నిమిత్తం 2020 ఫిబ్రవరి 20న విశాఖ వచ్చినట్లు వెల్లడించారు. ఆ తర్వాతనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో 2020, అక్టోబర్ 29న పోస్కో భేటీ అయింది. పోస్కో, ఆర్‌ఐఎన్‌ఎల్‌ మధ్య కుదిరిన ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లు రహస్యంగా ఉంచడంపై పలువురు మండిపడుతున్నారు. 2019లో ఒప్పందం జరిగితే ఇంత వరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. 2020 అక్టోబర్‌లో పోస్కో ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే.. అప్పుడు ఆయనకు ఈ విషయం తెలియదా అని నిలదీశారు. ఒకవేళ ముఖ్యమంత్రి జగన్‌కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ఆరోజే తెలిస్తే అప్పుడే దీన్ని అడ్డుకునేందుకు ఎందుకు కేంద్రంతో పోరాడలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: