పెట్రోల్, డీజిల్ రేట్లు తెలియకుండానే విపరీతంగా పెరిగిపోతున్నాయి. అదే సమయంలో ఆర్టీసీ మాత్రం చార్జీల భారం వేయలేదని ప్రజలు అనుకుంటున్నారు. అయితే అంతకు ముందే ఆర్టీసీ భారీగానే వడ్డించడంతో ఏపీ ప్రజలకు ఆ నొప్పి తెలియడంలేదు. పల్లె వెలుగు బస్సులను అల్ట్రా పల్లెవెలుగు అనే పేరుతో ప్రతి టికెట్ పై 5రూపాయల చార్జీ వడ్డించారు. కరోనా తర్వాత వృద్ధులకు ఇచ్చే రాయితీ పూర్తిగా పక్కనపెట్టేశారు. దీంతో అలా కూడా ఆర్టీసీకి ఆదాయం కలిసొచ్చింది. జర్నలిస్ట్ బస్ పాస్ లు కూడా అక్రిడేషన్లు రెన్యువల్ కాకపోవడంతో అటకెక్కేశాయి, అంటే ఇక్కడ కూడా ఆదాయమే. ఇక విద్యార్థులకు ఇచ్చే బస్ పాస్ ల రేట్లు కూడా పెరగడంతో మరీ నష్టాల్లో కూరుకుపోకుండా ఏపీఎస్ఆర్టీసీ ఆదాయం పెరుగుతోంది.

కోవిడ్‌ కారణంగా గత ఏడాది మార్చి 22 నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు రూ.2,603 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోయింది. ఈ ఏడాది ఆరంభం నుంచి పుంజుకోవడంతో రోజువారీ సగటు ఆదాయం రూ.12 కోట్లకు చేరింది. గత ఏడాది జనవరిలో 69 శాతం ఆక్యుపెన్సీతో రూ.420 కోట్ల ఆదాయం లభించగా.. ఈ ఏడాది జనవరిలో 64 శాతం ఆక్యుపెన్సీతో రూ.360 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ నెలలో 12వ తేదీ వరకు లభించిన ఆదాయం రూ.145 కోట్లకు చేరింది. మార్చి నాటికి టికెట్‌ రెవెన్యూ రూ.400 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పల్లెవెలుగు బస్సులు నామమాత్రంగానే ఉంచుతూ.. ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ వంటి సర్వీసులను పెంచడం ద్వారా అధిక ఆదాయంకోసం ఆర్టీసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. దూర ప్రాంత సర్వీసులను మరింతగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆదాయం పెంచుతున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో హైదరాబాద్‌ నుంచి వచ్చే సర్వీసులకు డిమాండ్‌ పెరిగింది. ఎక్కువమంది ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తుండటంతో స్పెషల్‌ సర్వీసులను నడుపుతున్నారు. మరోవైపు తిరుపతికి కూడా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఆర్టీసీ ప్రవేశపెట్టిన తిరుమల శీఘ్రదర్శనం టికెట్‌ ఆఫర్ ‌కు మంచి స్పందన వస్తోందని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో దూరప్రాంత సర్వీసుల్లో 10శాతం రాయితీ ఇస్తూ ప్రయాణికుల్ని ఆకట్టుకుంటోంది ఆర్టీసీ. మొత్తమ్మీద చార్జీల మోత మోగిన విషయం తెలియకుండానే, ప్రయాణికులపై భారం వేసి, లాభాలబాటపట్టింది ఆర్టీసీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: