ఏపీలో ఆర్టీసీ బస్టాండ్ లను షాపింగ్ మాల్స్ గా మార్చే ప్రక్రియపై వైసీపీ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ నిర్ణయం వెలువడినా.. దానిపై ఎవరూ పెద్దగా ఫోకస్ పెట్టలేదు. వైసీపీ వచ్చాక, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారు, ఆర్టీసీ ఆస్తులపై కూడా ప్రభుత్వానికి అధికారం వచ్చింది. దీంతో బస్టాండ్ ల రూపు రేఖలు మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి 15 బస్టాండ్స్ లో మొదటగా ఈ మార్పుని ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు.

బస్టాండ్ లలో ప్రజల రద్దీని ఉపయోగించుకునేందుకు ఆప్కోతో కలసి ఆర్టీసీ వినూత్న ప్రయోగం చేస్తోంది. ఆప్కో స్టాల్స్ ని అన్ని బస్టాండ్స్ లో ఏర్పాటు చేయబోతున్నారు. కార్పొరేషన్లు, ప్రధాన పట్టణాల్లోని 15 బస్టాండ్ లను దీనికోసం తొలి విడత ఎంపిక చేసుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం బస్టాండ్లలో వీటిని ఏర్పాటుచేస్తారు.  

అమూల్‌ మిల్క్‌ యూనిట్లు కూడా..
బస్టాండ్లలో ఆప్కో స్టాళ్లకే కాకుండా అమూల్‌ మిల్క్‌ యూనిట్లకు స్టాళ్లను కేటాయించేందుకు ఆర్టీసీ సుముఖంగా ఉంది. కొన్ని బస్టాండ్లలో సంగం డెయిరీకి ఇప్పటికే స్టాళ్లను కేటాయించారు. అమూల్ ‌తో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నందున, అమూల్‌ ఉత్పత్తులకూ స్టాళ్లను ఆర్టీసీ కేటాయించబోతోంది. విశాఖపట్నం ద్వారకా బస్టాండ్‌లో మత్స్యశాఖకు ఓ స్టాల్‌ను ఆర్టీసీ అధికారులు ఇటీవలే కేటాయించారు. వీటితోపాటు అసలు బస్టాండ్ లకే పూర్తి స్థాయిలో రూపు రేఖలు మార్చబోతున్నారు అధికారులు. ప్రభుత్వ సంబంధమైన షాపులతోపాటు, ప్రైవేటుకి కూడా భాగస్వామ్యం కల్పిస్తూ షాపింగ్ మాల్స్ తరహాలో బస్టాండ్ లను తీర్చిదిద్దే ప్రణాళికలో ఉన్నారు. 15 మోడల్ బస్టాండ్స్ లో ప్రయోగం సక్సెస్ అయితే ఇతర ప్రాంతాలకు కూడా ఇదే పద్ధతి విస్తరిస్తామని అంటున్నారు. బస్టాండ్ లలో షాపులకు ఇచ్చే అద్దె పెరిగితే.. ఆర్టీసీకి కూడా అదనపు ఆదాయం సమరూకే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: