గుంటూరు కార్పొరేష‌న్ ఎవ‌రికి ద‌క్కుతుంది?  అధికార పార్టీ వైసీపీ దూకుడు చూపుతుందా?  లేక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఇక్క‌డ మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకుంటుందా? అనేది కీల‌కంగా మారింది. అధికార పార్టీ  వైసీపీ విష‌యానికి వ‌స్తే.. సత్తా చాటుకొని.. తొలిసారిగా జీఎంసీలో మేయర్‌ పీఠం కైవసం చేసుకోవాలని ఇక్క‌డి నాయ‌కులు భావిస్తున్నారు. జీఎంసీ పరిధిలోని రెండు నియోజకవర్గాలైన తూర్పు, పశ్చిమలో వైసీపీ హ‌వా కొన‌సాగుతోంది. వాస్త‌వానికి ప‌శ్చిమ‌లో టీడీపీ గెలిచినా.. ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి మాత్రం వైసీపీకి మ‌ద్ద‌తుగా మారారు. అది కలిసొచ్చే అంశం అని వైసీపీ నాయ‌కులు ధీమా వ్యక్తం చేస్త‌న్నారు.

నగరంలో పట్టున్న నేతలు ఉండటంతో తమ గెలుపు ఖాయమంటూ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తూర్పు నియోజకవర్గ పరిధిలో డివిజన్లలో అభ్యర్థుల గెలుపు భారం ఎమ్మెల్యే ముస్తఫా చూస్తున్నారు. అలానే ప‌శ్చిమ నుంచి పోటీ చేసి ఓడిపోయిన‌.. చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి వంటి వారు కూడా పావులు క‌దుపుతున్నారు. గ‌త ఏడాది త‌మ వారికి వార్డు టికెట్లు ఇప్పించుకున్న నేప‌థ్యంలో వారిని గెలిపించుకునేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు.

ఇక‌, మద్దాలి గిరి కూడా వైసీపీ అభ్య‌ర్థుల‌కే ప్ర‌చారం చేస్తాన‌ని మాటిచ్చారు.  ఆయన స్వయంగా ప్రచారం లో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. ఇప్ప‌టికే అంతర్గత సమావేశాలు నిర్వహించారు. ప్ర‌బుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల‌ను పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల్లోకి తానే స్వ‌యంగా తీసుకువెళ్తాన‌ని చెబుతున్నారు. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా ఇంతే వ్యూహంతో ముందుకు సాగుతోంది. గుంటూరు నగరపాలక సంస్థపై పచ్చజెండా ఏగురవేసి పట్టు పెంచుకోవాలని టీడీపీ నేత‌లు రెడీ అవుతున్నారు. నగరపాలక సంస్థలో రెండుసార్లు తమ పాలన అందించామ‌ని.. అనేక కార్య‌క్ర‌మాలు చేశామ‌ని అంటున్నారు.

ఇక‌, ఇక్క‌డి కార్పొరేష‌న్‌కు ఇప్పటికి మూడుసార్లు ఎన్నికలు జరగగా రెండు సార్లు టీడీపీదే పైచేయిగా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఘోరంగా దెబ్బ తిన్నా గుంటూరు లోకసభ, పశ్చిమ నియోజకవర్గాన్ని ఆ పార్టీ కైవసం చేసుకొంది. తాజాగా మేయర్‌ స్థానం ఓసీ జనరల్‌కు కేటాయించటంతో టీడీపీ సీనియర్‌ నేత కోవెలమూడి రవీంద్రను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే.. కార్పొరేట్ల సీట్ల ఎంపికలో చోటు చేసుకున్న విభేదాలు  మాత్రం ఇప్ప‌టికీ చ‌ల్లార‌లేదు. దీంతో ప్ర‌చారంలో క‌లిసి వ‌చ్చే నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. మొత్తానికి వైసీపీ ఇక్క‌డ పాగా వేయొచ్చ‌నే సంకేతాలు వ‌స్తుండ‌డంతో టీడీపీలో అంత‌ర్మ‌థ‌నం స్టార్ట‌యింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు..! ఇక్క‌డ వైసీపీ గెలిస్తే ఓ పొలిటిక‌ల్ రికార్డు అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: