పంచాయతీ ఎన్నికల పోరు దాదాపు ముగింపు దశకు వచ్చింది. మరోవైపు.. పురపోరు ప్రారంభం కానుంది. వచ్చే నెల్లో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పంచాయతీ పోరులో పై చేయి సాధించిన వైసీపీ.. పనిలోపనిగా పురపాలకాల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. అయితే విజయనగరం జిల్లాలో మాత్రం ఆ పార్టీకి మున్సిపల్ ఎన్నికలకు ముందే గట్టి దెబ్బ తగలింది.


జిల్లాకు చెందిన కీలక నేత, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మామ, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర రాజు వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో వైసీపీ బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలకమైన ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర రాజు రాజీనామా చేయడం వైసీపీ నేతలు షాక్ ఇచ్చింది. పోనీ ఆ రాజీనామా ఏదైనా వ్యక్తిగత కారణాలతో చేస్తే కాస్త బెటర్ గా ఉండేది. కానీ.. మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర రాజు రాజీనామా చేసేటప్పుడు...  వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు వలనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం పార్టీకి మరింత దెబ్బగా మారనుంది.


విజయ నగరం జిల్లా రాజకీయాల్లో శత్రుచర్ల కుటుంబం మొదటి నుంచి కీలకపాత్ర పోషిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఆ కుటుంబానికి చెందిన శత్రుచర్ల పరక్షిత్‌రాజు సతీమణి పాముల పుష్పశ్రీవాణి వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ చూసుకుంటే.. కురుపాం నుంచి శత్రుచర్ల విజయరామరాజు 1978, 1983, 1985, 1999లలో ఎమ్మెల్యేగా  ఎన్నికయ్యారు. 1989లో విజయ రామరాజు తమ్ముడు శత్రుచర్ల చంద్రశేఖరరాజు, 2009లో మేనల్లుడు వీటీ జనార్దన్‌ థాట్రాజ్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన చంద్రశేఖర రాజు ఎటువైపు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఏ నిర్ణయం ప్రకటించలేదు. ప్రస్తుతానికి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. మరి ఇవి ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: