వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆళ్ల అయోధ్య‌రామిరెడ్డి, ఆయ‌న సోద‌రుడు, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి చేదు అనుభ‌వం ఎదురైంది. పంచాయితీ ఎన్నిక‌ల్లో వారి స్వ‌గ్రామం పెద‌కాకాని మండ‌లంలో తెలుగుదేశం పార్టీ త‌న ఆధిక్య‌త‌ను కొన‌సాగించింది. ఒక‌ర‌కంగా త‌న హ‌వాను చాటుకుంది. పెద‌కాకాని పంచాయితీని కైవసం చేసుకుంది. వాళ్ల సొంత నివాసాల‌కు స‌మీపంలో ఉండే వార్డుల్లో కూడా వైసీపీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థులు ఘోరంగా ఓట‌మిపాల‌య్యారు.  వైసీపీలో మేజ‌ర్ వ‌ర్గంగా, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ముఖ్యులుగా చెలామ‌ణి అవుతున్న ఆళ్ల అయోధ్య‌రామిరెడ్డి, రామ‌కృష్ణారెడ్డి సోద‌రులు, వారి బావ‌మ‌రిది మోదుగుల వేణుగోపాల‌రెడ్డి ముగ్గురూ క‌లిసి పెద‌కాకానిలో పార్టీ ఉనికిని కాపాడుకోలేక‌పోయారంటూ సొంత పార్టీ నుంచే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అలాగే పెదకూరపాడు నియోజకవర్గంలో కూడా టీడీపీ, వైసీపీ మ‌ధ్య  గట్టిపోటీ జ‌రిగింది. .ఈ నియోజకవర్గంలోని  బెల్లంకొండ మేజర్‌ పంచాయతీలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్‌ పీఠాన్ని చేజిక్కించుకున్నారు. పెద‌కాకాని పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోకి వ‌స్తుంది. బెల్లంకొండ పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోకి వ‌స్తుంది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల మాజీ ఎమ్మెల్యేలు ధూళ్లిపాళ్ల నరేంద్రకుమార్‌, కొమ్మాలపాటి శ్రీధర్‌ టీడీపీ ఉనికిని చాటేందుకు కృషి చేశారు. అలాగే హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ  శ్రేణులు అధికారపార్టీ బెదిరింపులకు లొంగకుండా హోరా హోరీగా పోటీపడ్డారు. ప్రకటించిన 10 స్థానాల్లో 5  సర్పంచ్‌ పదవులను టీడీపీ వర్గీయులు ద‌క్కించుకున్నారు. వట్టిచెరుకూరు మండలంలో ప్రకటించిన 15 స్థానాలకు గాను 8 గ్రామాల్లో టీడీపీ మ‌ద్ద‌తుదారులు విజయం సాధించారు.  ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన ప్రత్తిపాడుకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య పార్టీ ఉనికిని కాపాడేందుకు కృషిచేశారు. పొన్నూరు, పెద‌కూర‌పాడు, ప్ర‌త్తిపాడు నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, హోంమంత్రి ఎన్నోవిధాలుగా ప్రయత్నించిన‌ప్ప‌టికీ  ఫలితాలను ఏకపక్షం చేసుకోలేక‌పోయారు. ప్రలోభాలకు లొంగకుండా తెలుగుదేశం వర్గీయులు బరిలోకి దిగటమే కాకుండా ఒకవంతు స్థానాల్లో త‌మ సత్తా చాటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: